Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా ఆదాయంలో చంద్రబాబు వాటా ఎంత ?

‘హైదరాబాద్ ను కోల్పోవటంతో ఏపికి ఆదాయం తగ్గింది

..‘ఆంధ్రావాళ్ళంతా వచ్చేస్తే ఏపికి ఆర్ధిక సమస్యలే ఉండవు’. 

What is the chandrababu contribution to Telangana tax revenue

‘హైదరాబాద్ ను కోల్పోవటంతో ఏపికి ఆదాయం తగ్గింది’..’అదే సమయంలో హైదరాబాద్ లో వసూలయ్యే మొత్తం పన్నుల్లో 40 శాతం ఆంధ్రావాళ్ళు చెల్లిస్తున్నదే’..‘ఆంధ్రావాళ్ళంతా వచ్చేస్తే ఏపికి ఆర్ధిక సమస్యలే ఉండవు’.  ఇవి నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు. వినటానికి బాగానే ఉన్నా ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే, దశాబ్దాలుగా హైదరాబాద్ లో స్ధిరపడిన సీమాంధ్ర జనాలు ఇప్పటికిప్పుడు ఏపికి రావాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే, వాళ్ళ ఉద్యోగాలు, రిటైర్మెంట్లు, వాళ్ళ పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు సంపాదించుకోవటాలు..ఇలా అన్నీ హైదరాబాద్ లోనే ముడిపడి ఉన్నాయి.

కాబట్టి నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు కాదుకదా ఎవరు చెప్పినా హైదరాబాద్ వదలరు. అంతెందుకు చంద్రబాబునాయుడి ఆస్తలు ఎక్కడున్నాయి? వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే కదా? ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు కూడా హైదరాబాద్ లోనే కట్టుకున్నారు గానీ విజయవాడలో కాదు కదా? ఏపికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే ఏపిలో సొంతిల్లు కట్టుకోనపుడు మిగిలిన వాళ్ళు ఏపి గురించి ఎందుకు ఆలోచిస్తారు?

చంద్రబాబు సొంత సంస్ధ హెరిటేజ్ ఎక్కుడుంది? అది కట్టే ట్యాక్స్ లన్నీ కూడా తెలంగాణా ప్రభుత్వానికే వెళుతోంది కదా? మరి, హెరిటేజ్ సంస్ధను చంద్రబాబు ఏపికి ఎందుకు తరలించలేదు? చంద్రబాబే కాదు, మంత్రివర్గంలోని చాలామందికే కాకుండా ఎంఎల్ఏలు, ఎంపిల్లోని చాలామందికి సొంత ఆస్తులు, వ్యాపారాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నమాట వాస్తవం కాదా? వాస్తవాలు ఇలా వుండగా తెలంగాణా ఆదాయంలో 40 శాతం సీమాంధ్రులవే అని చెప్పటంలో అర్ధం లేదు. పైగా వారంతా ఏపికి వచ్చేస్తే రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలుండవని చెప్పటంలో అర్దమేలేదు.

రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చటంలో టిడిపి, భారతీయ జనతా పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు. కాకపోతే అప్పట్లో జనాల ఆగ్రహానికి కాంగ్రెస్ మాత్రమే గురికావాల్సి వచ్చింది. సరే, అయ్యిందేదో అయిపోయింది. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబుతో కలిసి నరేంద్రమోడి కూడా  ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు కదా? ప్రధానమంత్రి అయిన తర్వాత తానిచ్చిన హామీలనే మోడి ఎందుకు తుంగలో తొక్కారు? కాబట్టి,  ఆచరణ సాధ్యం కాని మాటలు కట్టిపెట్టి ముందు ఏపిని బలోపేతం చేయటానికి విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేస్తే అదే పదివేలు.  

Follow Us:
Download App:
  • android
  • ios