నేనేం పాపం చేశానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. అనవసరంగా పాదయాత్రపై ఎందుకు రాద్దాంతం. రాష్ట్రంలో బ్రిటిష్‌ పాలన సాగుతోందా..

"నేనేం పాపం చేశానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని" ప్రశ్నించాడు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. సీఎం మీద దండయాత్ర చేసేంత ధైర్యం, దమ్మూ త‌మ‌కు లేదన్నారు. పాదయాత్రను అడ్డుకుని తమను బందెలదొడ్లో పశువుల్లా ఒకే చోట కట్టేశారని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. 
అనంతరం ఆయన కిర్లంపూడిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 అనవసరంగా పాదయాత్రపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలీడం లేదన్నారు ముద్ర‌గ‌డ‌. తానేందుకు నడవకూడదో.. ఎవరూ చెప్పడం లేదు...ఇది కాపుల‌పై కక్ష సాధింపు కాక‌పోతే ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసుల‌తో క‌లిసి ప్ర‌భుత్వం త‌మ‌ని నిర్భందించి హాక్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్రంలో బ్రిటిష్‌ పాలన సాగుతోందా....అని ప్ర‌శ్నించారు. ఎంతకాలం ఇలా నిర్భందిస్తారు.. ప్ర‌భుత్వం త‌రుపు నుండి త‌న‌కి సమాధానం కావాలని డిమాండ్ చేశారు. 

పోలీసులతో పాలన చేయాలని చూసిన ప్రభుత్వాలు ఏవీ కూడా మనుగడ సాగించలేవన్నారు. ఎంతో కాలం నుంచి వేచి చూశాం. త‌మ‌ జీవితాలు ఇలానే విసిగి వేశారి పోవాలా?. మీరు కుల మీటింగ్‌లు పెట్టొచ్చు. ఇతర కులాలు మాత్రం సమిష్టిగా రోడ్ల మీదకు రాకూడదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశానికి, దేశంలోని అన్ని కులాలకు స్వతంత్రం వచ్చింది. కానీ కాపు జాతికి ఇంకా స్వతంత్రం రాలేదన్నారు ముద్రగడ. కాపులందరు వేరే దేశం నుంచి వచ్చామని ప్రభుత్వం నుండి ఓ కాగితం ఇవ్వండి. రోడ్ల మీదకు రాము. త‌మ‌ బతుకులు తాము బతుకుతామ‌న్నారు. కాపులపై ఈ అణచి వేత ధోరణి మానుకోవాలని ముద్ర‌గడ ప్ర‌భుత్వాన్ని కోరారు.

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి