అమరావతిలో ఏర్పాటుచేయాలనుకున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సంగతే మరచి పోయారా?
అమరావతి అంబేద్కర్ ఎక్కడ?
ఎనిమిది నెలలయింది. అమరావతి అంబేద్కర్ జాడ లేదు. ఎన్నో నిర్మాణాల రివ్యూ జరుగుతూ ఉంది. అమరావతిలో కట్టాలనుకున్న 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం గురించి ఏమీ వినిపించడం లేదు. 125 జయంతి సందర్భంగా నూతన రాజధాని పాంతంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహం నిర్మించి అంబేద్కర్ కు నివాళులర్పించడం జరగుతుందని మొదట మార్చి 29,2016 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభిస్తూ ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వివరించారు.
‘ ఈ విగ్రహం దేశంలోనివిగ్రహాలన్నింటిలో ఉత్తమ విగ్రహం అయి ఉంటుంది, అంతరికీ స్ఫూర్తి నిచ్చేలా ఉంటుంది,’ అని అన్నారు. తర్వాత 15 ఎకరాలలో 210 కోట్లు ఖర్చు చేసి అంబేద్కర్ స్మతి వనం, అంబేద్కర్ లైబ్రరీ,బౌద్ధ ధ్యాన కేంద్రం ఏర్పాటుచేస్తామని కూడా చంద్ర బాబు ప్రకటించారు.
అయితే, ఈ ప్రాజక్టు ఏమయిందో ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి కూడ సమీక్ష జరిపిన దాఖలా లేదు. ఈ అంబేద్కర్ ప్రాజక్టు వివరాలేవో వెల్లడించాలని నవ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కత్తి పద్మారావు అడుగుతున్నారు.
“ స్మృతి వనం 15 ఎకరాల్లో వస్తుందన్నారు. 210 కోట్ల అన్నారు. మరి బడ్డెట్ ఎంత కేటాయించారు. ఈ పనుల ను పర్యవేక్షించేందుకు ఏదయినా కమిటీ వేశారా? డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యంశంగా చేరుస్తామన్నారు. ఏదీ, ఒక్క పాఠ్యపుస్తకంలో కూడా ఇది కనిపించడం లేదేందుకు ?’ అని కత్తి పద్మారావు ప్రశ్నించారు.
అంబేద్కర్ ని నిర్లక్ష్యం తగదని చెబుతూ పబ్లిసిటీ సాధనంగా అంబేద్కర్ పేరు ప్రతిష్టలను దుర్వినియోగం చేయవద్దని ఆయన ముఖ్యమంత్రి తెలిపారు.
