దిక్కు తోచక నేతలందరూ మొక్కుబడిగా ప్రచారం మొదలుపెట్టారు. ఇందరూ ప్రచారం చేసినా కెజె రెడ్డి గెలుపు అనుమానమే అంటున్నారు.
రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు ఎదురుదెబ్బ తప్పేట్లు లేదు. టిడిపి అభ్యర్ధి కెజె రెడ్డి రూపంలోనే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు అభ్యర్ధి ఎంపికే తప్పని ఇపుడు సిఎం తీరిగ్గా విచారిస్తున్నారు. ఎందుకంటే, జిల్లా మొత్తంలో కెజె రెడ్డి ఎటువంటి వ్యక్తో అందరకీ తెలుసు. అందుకనే జిల్లాలోని చాలా మంది నేతలు వద్దంటున్నా వినకుండా కెజె రెడ్డిని పోటీలోకి దింపారు. దాంతో ఓటర్లందరూ బాహాటంగానే వ్యతిరేకమయ్యారు. అందరి వద్ద అప్పులు తీసుకుని ఎగొట్టటం, రియలఎస్టేట్ వెంచర్లు వేసి వందలాది మధ్య తరగతి జనాలను మోసం చేసిన ఘనుడిగా రెడ్డికి గట్టి పేరే ఉంది.
దానికి తోడు రెడ్డి నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎక్కడకు వెళ్ళినా ఓటర్ల నుండి తిరస్కారమే ఎదురవుతోంది. దాంతో ఏం చేయాలో అర్ధంకాక చివరకు ప్రచారం నుండే దాదాపు రెడ్డి తప్పుకున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్ధితుల్లోనే జిల్లాలోని ఇంటెలిజెన్స్ విభాగం కూడా పోటీలో ఉన్న అభ్యర్ధుల పరిస్ధితులపై చంద్రబాబుకు నివేదిక అందచేసినట్లు తెలిసింది. దాని ప్రకారం పోటీలో ఉన్న గేయానంద్, వెన్నపూస గోపాలరెడ్డి, కెజె రెడ్డి, నాగార్జునరెడ్డిలకు గెలుపు అవకాశాలున్నట్లు చెప్పిందట. దాంతో ఒళ్ళు మండిపోయిన చంద్రబాబు అభ్యర్ధి కెజె రెడ్డిని చెడామడా తిట్టారట.
తన వద్ద డబ్బు లేకపోవటంతోనే ప్రచారంలో వెనుకబడి ఉన్నానని రెడ్డి బదులిచ్చినట్లు సమాచారం. దాంతో చేసేదిలేక జిల్లాలోని ఎంఎల్ఏలను, ఇన్ఛార్జీలను డబ్బులు సర్దుబాటు చేయాలంటూ ఆదేశించారట. డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారని తెలిసింది. దాంతో ఏం చేయాలో దిక్కు తోచక నేతలందరూ మొక్కుబడిగా ప్రచారం మొదలుపెట్టారు. ఇందరూ ప్రచారం చేసినా కెజె రెడ్డి గెలుపు అనుమానమే అంటున్నారు.
