ఏలూరు: బిర్యానీ కోసం ఇద్దరు పిల్లలు ఆలయంలోని హుండీని పగులగొట్టారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ నెల 26వ తేదీ రాత్రి ఈ ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హుండీ నుండి రూ. 140 దొంగతనం చేశారు.

ఈ విషయాన్ని ఆలయ పూజారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

జగన్నాథపురానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ హుండీని పగులగొట్టి చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీని పగులగొట్టినట్టుగా వారిద్దరూ చెప్పారు. 

హుండీని పగులగొట్టి అందులో నుండి తీసుకొన్న డబ్బులతో బిర్యానీ తిన్నట్టుగా పిల్లలు చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.వారిద్దరిని అరెస్ట్ చేసి సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు.