విశాఖలో టీనేజర్ రీతీసాహా మృతి కేసులో మరో ట్విస్ట్: ఐపీసీ 302 కింద కేసు నమోదు
పశ్చిమ బెంగాల్ కు చెందిన విద్యార్ది రీతీసాహా అనుమానాస్పద మృతి కేసులో బెంగాల్ పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్టణం: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీనేజర్ రీతీసాహా అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న బెంగాల్ పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద నమోదు చేశారు. ఈ ఘటనపై విశాఖపట్టణం పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని 174 నుండి 302 సెక్షన్ కింద కేసును మార్చారు. ఈ కేసును డీసీపీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. హస్టల్ ఇంచార్జీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. పోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
విశాఖపట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రీతీసాహకు వైద్యం చేసే సమయంలో వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన పోలీసులు విశాఖపట్టణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాది జూలై 14న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రీతీ సాహా విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణంలోని నరసింహనగర్ లో గల సాధనా హస్టల్ లో రీతీసాహా ఉంటుంది. విశాఖలోని ఓ విద్యాసంస్థలో ఇంటర్ చదువుతుంది. విద్యాసంస్థకు అనుబంధంగా ఉన్న హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుండి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రీతీసాహా ను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ఆమె వైద్యానికి సహకరించలేదని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ కేసు విచారణలో విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి పేరేంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ విషయమై బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్ సీఎం ఆదేశం మేరకు కోల్‌కత్తాలో కేసు నమోదైంది. దీంతో బెంగాల్ పోలీసులు విశాఖపట్టణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రీతీసాహా మృతి చెందిన రోజున సీసీటీవీ పుటేజీపై కూడ మృతురాలి పేరేంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హస్టల్ భవనం పైకి వెళ్లే సమయంలో ఓ డ్రస్, భవనం పై నుండి కిందకు పడే సమయంలో రీతీసాహా మరో డ్రెస్ వేసుకున్న విషయం తేలింది. అంతేకాదు సీసీటీవీ పుటేజీలో కూడ సమయంలో తేడా ఉన్న విషయాన్ని మృతురాలి పేరేంట్స్ గుర్తు చేస్తున్నారు.
also read:విశాఖలో టీనేజర్ రీతీ సాహా కేసులో ట్విస్ట్: ఫోర్త్ టౌన్ సీఐ వీఆర్‌కు సరెండర్
ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న సమయంలో రీతీసాహా ఏం చెప్పిందనే విషయమై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇదిలా ఉంటే రీతీసాహా మృతిపై బెంగాల్ పోలీసులు నిన్న సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఓ బొమ్మను భవనం నాలుగో అంతస్తు నుండి కిందకు వేసి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విశాఖపట్టణానికి చెందిన ఫోర్త్ టౌన్ సీఐ శ్రీనివాసరావును సరెండర్ చేసిన విషయం తెలిసిందే.