విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడిందని... దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సోమవారానికి ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఈనెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలో అతిభారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిశాయి.

Read more   తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక... నేడు, రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు

మరోవైపు కర్నూల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో బైక్ తో పాటు ఇద్దరు యువకులు వాగులో కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడారు.

రెండు  రోజులుగా కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని  చిన్న కమ్మలూరు, యల్లావత్తుల మధ్య రోడ్డుపై నుండి వాగు నీరు ప్రవహిస్తోంది. దీంతో వాగును దాటేందుకు చాలా మంది భయపడ్డారు. కానీ ఇద్దరు యువకులు వాగును దాటే ప్రయత్నంలో కొట్టుకుపోయారు. బైక్ ను నీటిలో తోసుకొంటూ  ఇద్దరు యువకులు వాగును దాటే ప్రయత్నం చేశారు. కొన్ని క్షణాల్లో వాగును దాటేవారు. కానీ ఆ సమయంలోనే వాగు ఉధృతికి బైక్ తో పాటు ఆ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు.

వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు హెచ్చరించినా కూడ యువకులు వినలేదు. యువకులు కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడారు. 

కడప జిల్లాలో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలు చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలకు వరద పోటెత్తింది. ఇంకా 24 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.