విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రతీరాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై వుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపటికల్లా మరింత బలపడగలదని... దీన్ని అనుసరించి దక్షిణాది మీద రుతుపవనాలు  బలపడనున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని... అలాగే తెలంగాణలో నేడూ, రేపూ కూడా భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక అరేబియా సముద్రంలోనూ తుపాను ఆవర్తనం ఏర్పడటంతో మహారాష్ట్ర, కర్నాటకలకూ భారీ వర్షాల ముప్పు పొంచివుందని వెల్లడించింది. ఈ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల ప్రవాహాలు మళ్లీ భారీగా పెరిగే అవకాశాలున్నాయి.  తెలుగు రాష్ట్రాలలో నేడు సాయంకాలం వరకూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే   అవకాశం వుందని... అలాగే ఆంధ్రా తీరంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాబట్టి సామాన్య ప్రజలు, అధికారులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో జనావాసాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పరిణామాల దృష్ట్యా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకావముందన్న హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.