విశాఖపట్నం: ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా 4.5కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 48గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, కాలువలు, వాగులు వరద నీటితో ప్రమాదకర రీతిలో వరద నీటితో ప్రవహించాయి. అంతేకాకుండా నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా కృష్ణానది ప్రమాదకర రీతిలో ప్రవహించి ఆందోళనను కలిగించింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. 

వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నీటమునిగి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇలా ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలు రైతుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని కేవలం సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయన్న మాట వారికి ధైర్యాన్నిస్తోంది.