ఏలూరు: 2022 ఖరీఫ్‌ నుంచి పోలవరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీరు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. డ్యామ్ ఎత్తును ఒక్క మిల్లీ మీటర్ కూడ తగ్గించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును  సందర్శించారు. ప్రాజెక్టు వద్దే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 
41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపునకు గురౌతున్న ప్రాంతాల్లో పునరావాస పనులు  చేపట్టాలని ఆయన సూచించారు.

  పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3330 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.వచ్చే ఏడాది జూన్‌ 15కు మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా పనులు మళ్లీ ఒక సీజన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. 

వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్‌  ఛానల్‌ పనులు సంపూర్ణంగా పూర్తికావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయానికి కాఫర్‌ డ్యాంలో ఉన్న ఖాళీలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అప్పుడే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా ముందుకుసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు కూడా అదే సమయంలో ముందుకుసాగాల్సి ఉంటుందన్నారు. 

ఒక్క మిల్లీమీటరు కూడా డ్యాం ఎత్తు తగ్గించడంలేదని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ 45.72 మీటర్లు ఉంటుందన్నారు.
ఈ విషయమై లేని పోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.

డ్యాం నిర్మాణంతో పాటు అదే వేగంతో సహాయ పునరావాస కార్యక్రమాలూ చేపట్టాలని సీఎం అధికారులను కోరారు. పునరావాస కార్యక్రమాలను పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు డ్యాంలు కట్టినా సరే పూర్తిస్థాయిలో  నీటిని నిల్వ చేయలేకపోయామన్నారు. పోలవరంలో పునరావాస కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 

కాపర్‌ డ్యాం గ్యాప్‌లు మూసివేసే సమయంలో డెల్టాకు సాగునీరు, తాగునీటి కొరత రాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు అనుసరించాలన్నదానిపై కార్యాచరణ చేయాలని  అధికారులను  సీఎం ఆదేశించారు.ఈ విషయమై యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి ఇస్తామని ఇరిగేషన్ అధికారులు సీఎంకు చెప్పారు.