అమరావతి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీకి పూర్వ వైభవం తెచ్చి చంద్రబాబును సీఎంగా గెలిపించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆయన సోమవారం నాడు  ఆయన పార్టీ నేతలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. బీసీలపై నమ్మకంతో పదవి ఇచ్చిన ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు మాజీ మంత్రి ఎర్రన్నాయుడిని మించి పనిచేస్తానని చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవులు ఎందుకు పనికిరావని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలకు ఇస్తున్న పథకాలే బలహీనవర్గాలకు ఇస్తున్నారన్నారు.

బీసీలను ఐక్యం చేస్తానని చెప్పారు. పార్టీ ఓడినా గెలిచినా బీసీలు ఎప్పుడూ టీడీపీతోనే ఉంటారని ఆయన తెలిపారు.టీడీపీ నియామకాల్లో 60 శాతం బీసీలకే ఇచ్చారన్నారు. 16 నెలల్లో  రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యం, కక్ష సాధింపు చర్యలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని ఆయన విమర్శించారు.

పార్టీలో అందరిని కలుపుకొనిపోతూ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.  తనకు ఆరోగ్యం బాగా లేనందున  కొంతకాలం పాటు గ్యాప్ ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఇక నుండి ప్రజా క్షేత్రంలో ఉంటానని చెప్పారు.