ఒంగోలు: తమిళనాడులో పోలీసులు పట్టుకొన్న నగదుకు  మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు తెలిపారు.  ఈ నగదు మంత్రికి సంబంధిస్తే తాను దేనికైనా సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు. 

also read:ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా, టీడీపీ లేకుండా చేస్తా: మంత్రి బాలినేని సంచలనం

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. తమిళనాడులో పోలీసులు పట్టుకొన్న డబ్బులు తనవేవనని బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన తమిళనాడులో ఓ కారులో రూ. 5.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ నగదు ఏపీ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 

వ్యాపారం కోసం బంగారం కొనుగోలుకు తీసుకెళ్తుండగా పట్టుకొన్నారని ఆయన తెలిపారు. పోలీసులు పట్టుకొన్న నగదులో బ్లాక్‌మనీ లేదని చెప్పారు.డ్రైవర్ అత్యుత్సాహంతో ఎమ్మెల్యే పాత స్టిక్కర్ అంటించారని ఆయన చెప్పారు. తాను దొంగ బంగారం వ్యాపారం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 

తాను విక్రయించే ప్రతి గ్రాము బంగారానికి లెక్కలున్నాయన్నారు. తాను వైసీపీలో తిరుగుతున్నందు వల్లే తనపై కొందరు బురదచల్లుతున్నారని ఆయన ఆరోపించారు.తమిళనాడు ఐటీ అధికారులకు తాము ఇప్పటికే ఈ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించినట్టుగా ఆయన తెలిపారు.