ఒంగోలు: తమిళనాడులో దొరికన డబ్బులు తనదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గురువారం నాడు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ డబ్బు విషయంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన క్యారెక్టర్ గురించి ప్రజలకు తెలుసునన్నారు. టీడీపీ అబాండాలు వేయడం సరైంది కాదన్నారు.

తమిళనాడులో పట్టుబడిన నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ డబ్బులు తనకు చెందినవని బంగారం వ్యాపారి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

also read:రూ. 5.25 కోట్ల పట్టివేతపై బంగారం వ్యాపారి ట్విస్ట్: స్టిక్కర్ పై ఏపీ ఎమ్మెల్యే

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన లోకేష్ ఈ ఆరోపణలను నిరూపించాలని ఆయన కోరారు. లేకపోతే లోకేష్ క్షమాపణ చెప్పాలన్నారు.

తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.  జిల్లాలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలను తమ పార్టీలో చేరడంలో తాను కీలక పాత్ర పోషించానని తనను లక్ష్యంగా చేసుకొని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.తాను తలుచుకొంటే జిల్లాలో టీడీపీ లేకుండా వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తానని ఆయన చెప్పారు.