విశాఖపట్టణం: బాక్సైట్ తవ్వకాల విషయంలో కేంద్రం  ఎంత  ఒత్తిడి తెచ్చినా  కానీ తాను ఒప్పుకోలేదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

విశాఖ జిల్లాలోని అడారిమెట్టలో గురువారం నాడు జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  పాల్గొన్నారు. బాక్సైట్  తవ్వకాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.తాను అదికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దుచేసినట్టు చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల విషయంలో  పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినా కూడ  తాను  అంగీకరించలేదని  ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.2300 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.  

విశాఖ జిల్లాలోని ఏజన్సీలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అమలౌతున్న తీరును ఆయన అడిగి తెలుసుకొన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. 

అడగకుండానే వరాలిచ్చే పార్టీ తెలుగుదేశం అని  సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. .ఈ సందర్భంగా ‘గిరి ప్రగతి’ వెబ్ సైట్, జీసీసీ ఉత్పత్తులను చంద్రబాబు ఆవిష్కరించారు. మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. 

 గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. కేవలం భూములు ఇవ్వడమే కాకుండా సాగును లాభసాటిగా మారుస్తామని, గిరిజన ప్రాంతంలో పండించే జీడిపప్పుకు ప్రాధాన్యత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గిరిజన పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపుతున్నట్టు ఆయన చెప్పారు.