అమరావతి: చంద్రబాబుకు పిచ్చిపట్టింది.. ఆయనను  ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఎర్రగడ్డకు నేను వెళ్లాలో.. మీరు వెళ్లాలో తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు జగన్ కు కౌంటరిచ్చారు.

మంగళవారం నాడు ఉదయం నుండి ఏపీ అసెంబ్లీలో వాడీవేడీగా  అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. టిడ్కో ఇళ్ల  విషయంలో ఉదయం నుండి ఈ రెండు పార్టీల సభ్యుల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకొన్నాయి.

ఈ విషయమై చర్చ జరిగే సమయంలో  చంద్రబాబునాయుడు, జగన్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ కు చంద్రబాబునాయుడు సూచించారు.

మాట తప్పం, మడమ తిప్పమని చెప్పుకొనే జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను కట్టిన ఇళ్లతో మీ పెత్తనం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. 

also read:పిల్లి శాపనార్ధాలు, ఉడుత ఊపులకు భయపడను: చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని ఫైర్

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటరిచ్చారు. ఏం చెప్పాలనుకొంటున్నారో చంద్రబాబుకు క్లారిటీ లేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాను చెప్పిన అంశాలను వక్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు దక్కదని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.టిడ్కో ఇళ్ల విషయంలో మంత్రులు బొత్స సత్యనారాయణకు మరో మంత్రి చేసిన వ్యాఖ్యలకు మధ్య తేడా ఉందని చంద్రబాబు చెప్పారు.