గ్రామ సచివాలయంలోనే ఓ వీఆర్వో మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. విధులు పక్కన పెట్టేసి.. చక్కగా ఆఫీసులోనే మసాజ్ చేయించుకున్నారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కిర్లంపూడి మండలం వేలంకలోలాక్‌డౌన్ సడలించడంతో మళ్లీ గ్రామ సచివాలయంలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీఆర్వో భాస్కరరావు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. 

వీఆర్వో భాస్కరరావు సచివాలయానికి వచ్చారు.. బార్బర్‌ను పిలిపించుకున్నారు. ఓవైపు విధులు నిర్వహిస్తూనే.. అతడితో మసాజ్ చేయించుకున్నారు. కార్యాలయంలో తోటి సిబ్బంది అందరూ ఉండగానే ఈ ఘటన జరిగింది. ఈ మసాజ్ సీన్ మొత్తాన్ని ఎవరో తెలియకుండా తమ మొబైల్‌లో వీడియో తీసి వాట్సాప్‌లో షేర్ చేయడంతో చర్చనీయాంశమైంది. ఏకంగా గ్రామ సచివాలయంలోనే వీఆర్వో మసాజ్ చేయించుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై వీఆర్వో భాస్కరరావు, అధికారులు స్పందించాల్సి ఉంది.