ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకీ అనుకూలంగా పనిచేశారంటూ పలువురు వాలంటీర్లను తొలగించడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో టీడీపీ మద్ధతుదారులు గెలిచిన గ్రామాల్లో వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

రెండో విడతలో భాగంగా ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. పలుచోట్ల టీడీపీ సానుభూతిపరులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన ధేనువకొండ పంచాయతీలో ఏడుగురు, మోదీపల్లిలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీవో రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరికొన్ని పంచాయతీల్లో 25 మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీకి మద్ధతుగా వుండటం వల్లే వారిని తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పనితీరు బాగోలేక పోవడం వల్లే తొలగించామని అధికారులు అంటున్నారు.