విశాఖ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధానంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సుధాకర్‌తో పొసగడం లేదు. రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని.. ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని వాసుపల్లి గణేష్ చురకలు వేశారు. 

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే (vizag south assembly constituency) వాసుపల్లి గణేష్ కుమార్ (vasupalli ganesh kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ (tdp) నుంచి గెలిచిన ఆయన వైఎస్సార్‌సీపీకి (ysrcp) జై కొట్టిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో ఆయన అంతగా సర్దుకోలేకపోతున్నారని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. నియోజకవర్గంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో (ap brahmin corporation chairman sudhakar) గణేష్‌కు విభేదాలు మొదలయ్యాయి. ఓ ఎంపీని అడ్డుపెట్టుకుని సీతంరాజు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారంటూ గణేష్ బహిరంగంగానే తన అసంతృప్తిని బయటపెట్టారు. రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని.. ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని చురకలు వేశారు. 

విశాఖలో ఓ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన గణేష్‌ను సీతంరాజు సుధాకర్‌తో విభేదాలు ఉన్నాయా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేసిన ఎంపీకి ఈ విషయం ఎందుకు అర్థంకాలేదో తెలియడం లేదన్నారు. కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) సమస్యను పరిష్కరించాలని గణేశ్ అన్నారు. 

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధాకర్‌ని, పరోక్షంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని వాసుపల్లి గుర్రుగా ఉన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ను పట్టించుకోవడం లేదని గణేష్ వర్గీయులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో తానే ఎమ్మెల్యే అంటూ సుధాకర్‌ ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి (vijayasai reddy) అండతో నియోజకవర్గంలో చైర్మన్‌ సుధాకర్ జోక్యం చేసుకుంటున్నారని గణేష్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిపై వచ్చిన ఫిర్యాదుల కారణంగానే ఆయనను ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త బాధ్యతల నుంచి జగన్ తప్పించారని చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గణేష్ కుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి విజయసాయిరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది.