విశాఖపట్నం పోలీసులు భారీ లోన్ యాప్ మోసం గుట్టు రట్టు చేశారు. లోన్‌యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కంపెనీకి సహకరిస్తున్న వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విశాఖపట్నం పోలీసులు భారీ లోన్ యాప్ మోసం గుట్టు రట్టు చేశారు. లోన్‌యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కంపెనీకి సహకరిస్తున్న వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న కడప జిల్లాకు చెందిన రాజు జయసింహారెడ్డిగా గుర్తించారు. ఇందులో కనీసం రూ. 100 కోట్ల వరకు లావాదేవీలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. రూ. 5వేలు అప్పుగా తీసుకున్న తనను షటిల్ లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారని విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది.

ఇందుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ గూగుల్ ప్లే స్టోర్ నుంచి షటిల్ లోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఆమె తన కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీకి యాక్సెస్‌ను అందించింది. మే 17న రూ. 5,000 రుణం తీసుకుంది. ఆ మరుసటి రోజు వడ్డీ మినహాయించి రూ.3,800 ఆమె ఖాతాలో జమ అయింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నిర్వాహకులు ఆమెకు మూడు రోజుల సమయం ఇచ్చారు. గడువులోపు అప్పు తీర్చినప్పటికీ.. ఆమెను బెదిరించి 12వేలు ఇవ్వాలని అడిగారు. ఆ మహిళ వేధింపులకు గురికాకుండా ఉండేందుకు వెంటనే రూ.12వేలు చెల్లించింది. 

అయినప్పటికీ యాప్ నిర్వాహకులు ఆమెను ఇబ్బంది పెట్టడం కొనసాగించారు. మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్స్‌కు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ మహిళ మే 24న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. 

బాధిత మహిళకు వచ్చిన వాట్సాప్ కాల్ నేపాల్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ భవానీ ప్రసాద్, ఆయన బృందం.. మహిళ ఖాతాలో డబ్బులు జమచేసిన బ్యాంక్ అకౌంట్‌ను ట్రాక్ చేశారు. అది హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్‌లో ఉన్నట్టుగా నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత వివరాలు సేకరించగా.. అది ఓ సంస్థ పేరు మీద ఉంది. ఆ అకౌంట్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న రాజు జయసింహారెడ్డి తెరిచినట్టుగా గుర్తించారు. అనంతరం అతడిని హైదరాబాద్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. 

విచారణలో జయసింహారెడ్డి.. లోన్ యాప్ రాకెట్ ‌గురించి పలు విషయాలను వెల్లడించాడు. ‘‘షటిల్ లోన్ యాప్ ఇతర చైనీస్ లోన్ యాప్‌లతో లింక్ చేయబడిందని తెలిసింది. సింహారెడ్డి తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఫేస్‌బుక్ ద్వారా చైనాకు చెందిన కెవిన్ వాంగ్‌తో పరిచయం ఏర్పడింది. అతను వాంగ్‌కు సహకరించడం మొదలుపెట్టాడు. 11 ఫర్మ్ ఖాతాలతో సహా 16 బ్యాంక్ ఖాతాలను తెరిచాడు. నిందితుడు రుణ దరఖాస్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేయడానికి లోన్ యాప్ నిర్వాహకులకు కేవైసీ వివరాలను, అన్ని బ్యాంకు ఖాతాల యాక్సెస్‌ను అందించాడు. వారు ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. గత ఆరు నెలల్లో నిర్వాహకులు సుమారు రూ.100 కోట్ల మేర లావాదేవీలు జరిపారు’’ అని పోలీసులు చెప్పారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతిపెద్ద లోన్ యాప్ మోసం ఇదేనని.. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో కేసును మరింత దర్యాప్తు చేస్తామని విశాఖ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు. చైనీస్ లోన్ యాప్‌ బాధితులు చాలా మంది ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అప్పు చేసి వేధింపులకు గురైతే పోలీసులను సంప్రదించాలని బాధితులను కోరారు.