Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ మార్పుకు భాజపా పట్టు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పై భారతీయ జనతా పార్టీ నేతల పోరాటం క్లైమాక్స్ కు చేరుకుంటోందా?

Vizag MP haribabu urged center to appoint separate governor for AP

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పై భారతీయ జనతా పార్టీ నేతల పోరాటం క్లైమాక్స్ కు చేరుకుంటోందా? గవర్నర్ ను మార్చాలని డిమాండ్ చేసేంత స్దాయిలో గవర్నర్-భాజపా నేతల సంబంధాలు క్షీణించాయా? పరిస్దితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మొన్నటి వరకూ గవర్నర్ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని భాజపా నేతలు హెచ్చరించిన సంగతి అందరికీ తెలిసిందే.  దానికి కొనసాగింపుగా మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి కంభపాటి హరిబాబు కేంద్రానికి రాసిన లేఖ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఇంతకీ హరిబాబు కేంద్రానికి ఏమని లేఖ రాసారంటే, నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ ను నియమించాలని హరిబాబు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాసారు. అలాగే  హైకోర్టు కోసం ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని లేఖలో కోరారు.

ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌పై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఇప్పటికే పత్రికా ముఖంగా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ హరిబాబు కేంద్ర హోమంత్రికి లేఖ రాయడంతో ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే. భాజపా నేతలే తమంతట తాముగా గవర్నర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారా? లేక ఇంకెవరన్నా వీరి వెనకున్నారా అన్నదే తేలటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios