విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టెరిన్ గ్యాస్ ప్రభావానికి  లోనయిన యలమంచలి కనకరాజు సోమవారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది.

విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. అయితే నిన్నమళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయిన అతడు మృతి చెందాడు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన వల్లే అతడు మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స అనంతరం కూడా ఇలా ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో వెంకటపురం  గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇలా ఇప్పటివరకు ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతిచెందగా తాజా మరణంతో ఆ సంఖ్య 14కిచేరింది. 

read  more   ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ మానవ తప్పిదమే: ఎన్జీటీకి కమిటీ నివేదిక

గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించాయి.  ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకవడంతో మనుషులే కాదు మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన హృదయవిదారక దృశ్యాలను కూడా కనిపించాయి.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్డుపైనా, ఇళ్లలో పడిపోయిన వారిని కాపాడి హాస్పిటల్స్ కి తరలించారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. 

 విశాఖపట్నం ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9) అనే ఇద్దరు చిన్నారులు ఘటనలో మరణించారు. చంద్రమౌళి (19) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు.