తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం విచారణ జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టిన ఐదుగురు సభ్యుల కమిటీ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది.

స్టైరిన్ గ్యాస్ లీక్ మానవ తప్పిదమేనని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యమే ఇంతటి విషాదానికి కారణమని సభ్యులు నివేదికలో పొందుపరిచారు. దీనిపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ .. కమిటీ నివేదికపై అభ్యంతరాలు చెప్పాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఒక రోజు గడువు ఇచ్చింది.

Also Read:ఎల్జీ పాలిమర్స్ ఘటన: అంతటికి కారణం ఆ ఒక్కడే!

ఈ కేసుపై ఇవాళ లేదా రేపు తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది. ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు. గ్యాస్ లీక్ ఘటనపై కేసును సుమోటాగా స్వీకరించే అధికారం.. ఎన్జీటీకి లేదని పాలిమర్స్ సంస్థ వాదనలు వినిపించింది.

మరోవైపు ఈ గ్యాస్ లీక్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈఏఎస్ శర్మ కోరారు. కాగా గ్యాస్ లీక్ జరిగి 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖలోని పరిశ్రమల శాఖేనని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది.

Also Read:3 గంటల పాటు సీఐడీ విచారణ: ఎవరీ రంగనాయకమ్మ, వివాదం ఎమిటి?

సీనియర్ అధికారి నీరబ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ హై పవర్ కమిటీకి ఈ నివేదికను రెండు రోజుల క్రితం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో నియమించిన కమిటీ అందజేసింది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి డీసీఐ ఆఫ్ ఫ్యాక్టరీస్ విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్నిర్లక్ష్యమే కారణమని నియమించిన కమిటీ అభిప్రాయపడింది.

ఇంతవరకు ఆ కంపెనీ చుట్టుపక్కల ఏనాడు కూడా మోక్ డ్రిల్ల్ నిర్వహించిన పాపాన పోలేదని, అంతే కాకుండా అక్కడి ప్రజలకు కనీసంక్ ఆపత్కాలీన సమయంలో ఎలా తప్పించుకోవాలో కనీస అవగాహన కూడా కల్పించలేదని ఆ కమిటీ అభిప్రాయపడింది.