విశాఖ రైల్వేజోన్: పీయూష్ గోయల్ ప్రకటన వెనుక...

Vishaka railway zone: Is it benfit to Ap state and Railway
Highlights

విశాఖ రైల్వే జోన్ ‌తో ఎవరికి లాభం


విశాఖపట్టణం: విశాఖలో రైల్వేజోన్  ఏర్పాటు చేయాలని  దశాబ్దకాలంగా  పోరాటాలు సాగుతున్నాయి.  అయితే విభజన చట్టంలో  కేవలం రైల్వేజోన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అసలు  రైల్వేజోన్ ఏర్పాటుపై ఎవరికీ లాభం, నిజానికి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే ఏపీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతోంది, ఇక్కడ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటనే విషయాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఒడిశాకు చెందిన కొందరు బిజెపి నేతలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు బిజెపి నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.


2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విభజన హమీ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ చట్టం ప్రకారంగా షెడ్యూల్ 13లో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలనే విషయమై స్పష్టంగా పేర్కొన్నారు.  ఆరు మాసాల్లోనే రైల్వే జోన్ ఏర్పాటు విషయమై రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి ఆరుమాసాల్లోనే అన్ని రకాల నివేదికలను తెప్పించి కొత్త రైల్వేజోన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఉంది. కానీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా చేసిన ప్రకటన మాత్రం కొంత వివాదాస్పదంగా మారింది.


విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే ఏపీ రాష్ట్రంలో కూడ  ఒక్క రైల్వేజోన్ ఏర్పాటైనట్టుగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే జోన్  ఉంది.  అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మాత్రం  విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైతేనే  రైల్వేజోన్ ఉంటుంది. ప్రస్తుతం విశాఖలోని దువ్వూరు వరకు దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోకి వస్తోంది. అక్కడి నుండి విజయనగరం వరకు  ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ లోకి వెళ్తోంది.


రైల్వేజోన్ ఏర్పాటు కోసం  రాజకీయ నిర్ణయం తీసుకొంటే సరిపోతోందని వాదించేవారు కూడ లేకపోలేదు. ఈ వాదనలో కూడ సహేతుకత లేకపోలేదు. అయితే గతంలో కూడ రైల్వేజోన్‌ల ఏర్పాటు విషయమై  కూడ  అనేక అడ్డంకులు వచ్చినా కూడ  కొత్తగా రైల్వేజోన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తు చేస్తున్నారు. 

వాజ్‌పేయ్ నేతృత్వంలోని  కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం  ఏకంగా  6 కొత్త రైల్వేజోన్లను ఏర్పాటు చేసింది.  ఆనాడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న రామ్‌విలాస్‌పాశ్వాన్  తన పార్లమెంటరీ కేంద్రమైన హజీపూర్‌లో రైల్వేజోన్‌ను ఏర్పాటు చేశారు.. జైపూర్‌, హుబ్లీ, జబల్‌పూర్‌, అలహాబాద్‌, భువనేశ్వర్‌లో గత ఎన్‌డీఏ కాలంలోనే రైల్వేజోన్లు ఏర్పాటయ్యాయి. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా వున్నప్పుడు కలకత్తా మెట్రోను ఒక ప్రత్యేక రైల్వే జోన్‌గా ఏర్పాటు చేశారు.

ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న  రాజకీయ పరిస్థితులు, తమ పార్టీలకు ప్రయోజనం కల్గించే అంశాలను ఆధారంగా చేసుకొని  కొత్త రైల్వేజోన్లు ఏర్పాటు చేసినవి. సాంకేతిక కారణాలను సాకుగా చూపి విశాఖ రైల్వేజోన్ ను ఏర్పాటు కాకుండా అడ్డుకొంటున్నారనే  విమర్శలు కూడ లేకపోలేదు.  అయితే రాజకీయ నిర్ణయం తీసుకొంటే సాంకేతిక సమస్యలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండకపోవచ్చని వాదించేవారు కూడ లేకపోలేదు. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌ వంటి చిన్న    రాష్ట్రాల్లో కూడా రైల్వేజోన్లు వున్నాయి. 


కాని 5కోట్ల మంది పైగా జనాభా వున్న ఆంధ్రరాష్ట్రంలో ప్రత్యేక రైల్వేజోన్‌ లేదు. ఇదే ఎన్‌డీఎ ప్రభుత్వం 1998లో 292కిమీ లెన్లు వున్న రాయపూర్‌ కేంద్రంగా రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేసింది. 2003లో 411 కిమీ రైల్వే లైన్లు వున్న రాంచి కేంద్రంగా కూడా డివిజన్‌ ఏర్పాటు చేసింది. ఒక డివిజన్‌ ఏర్పాటు జరగాలంటే 600 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉండాలి. దీనికి భిన్నంగా రైల్వే డివిజన్‌లను ఏర్పరిచిన ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని అర్హతలు వున్నా విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు కూడ లేకపోలేదు.


వాల్తేరు రైల్వే డివిజన్‌ 1052కిమీ రూట్‌తో దేశంలోనే అతిపెద్ద రైల్వే డివిజన్‌లలో ఒకటిగా వుంది. ఆదాయంలో దేశంలో 4వ స్థానంలో వుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తూర్పుకోస్తా రైల్వే దేశంలో ప్రథమస్థానంలో నిలిచింది. తూర్పుకోస్తా రైల్వే ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,978.28కోట్లు కాగా అందులో రూ.7034.58కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్‌ నుంచే వచ్చింది. అంటే 44 శాతానికి పైగా ఆదాయం విశాఖ నుండే వచ్చింది. ఇంత ఆదాయం దేశంలోని సగానికి పైగా రైల్వేజోన్లకు కూడా లేదు.ఈ డివిజన్‌కు 2013-14 ఆర్థిక సంవత్సరంలో దీని ఆదాయం రూ. 6,216 కోట్లు. 2014-15లో 6,653.31 కోట్లు. 2015-16లో 7,034.50 కోట్లు. ఈ ఒక్క ఏడాదిలోనే 55.66 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ. 6,456.84 కోట్లను ఆర్జించింది. ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు ఉత్పత్తులు, పెట్రోలియం, సిమెంటు, అల్యూమినా రవాణాకు వాల్తేరు డివిజనే కీలకం. విశాఖ కేంద్రంగా ఉన్న పోర్టులు, భారీ పరిశ్రమలే ప్రధాన ఆదాయ వనరులు.

ఇంత బలమైన కేంద్రంగా వున్న విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వేజోన్‌ అర్హతలేదని కేంద్రం వాదించడం విచిత్రంగా వుంది. ప్రత్యేక రైల్వే జోన్‌కు అవసరమైన సాంకేతిక అంశాలు కూడా విశాఖ కేంద్రంలో వున్నాయి. ఉదాహరణకు రైల్వే జోన్‌ ఏర్పాటైతే దానికి అవసరమైన మౌలికసదుపాయాల కోసం కనీసం 200 ఎకరాల ఖాళీ స్థలం అవసరం. విశాఖపట్నం నగరంలో రైల్వేకు 782 ఎకరాల ఖాళీస్థలం వుంది. దానిలో రైల్వేస్టేషన్‌కు ఆనుకొనే 210ఎకరాల ఖాళీస్థలం వుంది. మౌలిక వసతులలో భాగమైన హాస్పటల్‌, క్వార్టర్స్‌, ఆఫీసర్స్‌ క్లబ్‌ వంటివి ఇప్పటికే వుండడం వల్ల ప్రత్యేకంగా నిర్మించవలసిన అవసరం కూడా వుండదు. ఫలితంగా అదనపు ఖర్చు కూడా వుండదు.


ఏపీ రాష్ట్రంలో విశాఖ అతి పెద్ద నగరంగా కూడ ఉంది.  తూర్పు కోస్తాలోని చెన్నై, కోల్‌కత్తాల మధ్య అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది.  విశాఖలో స్టీల్ ప్లాంట్, పోర్ట్, పారిశ్రామికంగా అభివృద్ది చెందింది. అంతేకాదు తూర్పు నౌకదళానికి ప్రధాన కేంద్రంగా కూడ విశాఖ కొనసాగుతోంది.  ఆంధ్రా యూనివర్శిటీతో పాటు పలు కాలేజీలు, యూనివర్శిటీలు  కూడ విశాఖలో ఉన్నాయి. ప్రముఖ ఆసుపత్రులతో పాటు పర్యాటక కేంద్రంగా కూడ విశాఖ పేరొంది. విశాఖ బీచ్‌తో పాటు, బొర్రాగుహలు,  అరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు పర్యాటకులు వస్తుంటారు. విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులలో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం పెద్ద ఎత్తున జరగడం వల్ల విశాఖ రైల్వే డివిజన్‌కు భారీగా ఆదాయం కూడా సమకూరుతోంది.


వాస్తవానికి విశాఖ రైల్వే జోన్‌లో కలపవలసిన గుంతకల్‌, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి (గుంతకల్‌ నుంచి విడదీసి) డివిజన్ల మొత్తం ఆదాయంతో అది భారతీయ రైల్వేలోనే అత్యధిక ఆదాయం వచ్చే జోన్‌గా నిలుస్తుంది. అయినా రైల్వేజోన్ ఏర్పాటు విషయమై కేంద్రం నుండి సరైన స్పందన రావడం లేదనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ 13లో వైజాగ్‌ - చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కారిడార్‌ అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు అత్యవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ- శ్రీకాకుళం, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు- అనంతపూర్‌ ప్రాంతాలను ‘‘గ్రోత్‌ కారిడార్‌’’గా పేర్కొంది. వీటికి కొత్త రైల్వే లైన్ల నిర్మాణం తప్పనిసరి. రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందాలంటే పై అంశాలన్నీ సకాలంలో అమలు కావాలి. రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే జోన్‌ కేంద్రం ప్రధాన భూమిక పోషిస్తుంది. నేడు నూతనంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో జోన్‌ కేంద్రం లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది.


స్వాతంత్రం వచ్చిన తరవాత బ్రిటిష్ కాలం లోని వివిధ రైల్వేలు అన్నిటిని విలీనం చేసి 1950 లో 3 జోన్లతో భారతీయ రైల్వే ప్రస్థానం ప్రారంభం అయ్యింది. 1966 లో చివరిగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పరిచారు. అది 9వ రైల్వే జోన్. అయితే అప్పటి నుంచి, అనగా 1966 నుంచి 1999 వరకు 33 సంవత్సరాలు పాటు దేశంలో మరో జోన్ ఏర్పాటు చెయ్యలేదు. 1999 లో వాజపేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 7 కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చెయ్యడంతో మొత్త౦ రైల్వే జోన్లు దేశంలో సంఖ్య 16కి పెరిగింది.

కాగా ప్రస్తుతం దేశంలో 16 రైల్వే జోన్లు, కలకత్తా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే భారతీయ రైల్వే అద్వర్యంలో నడుస్తున్నాయి. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటి అంటే 3 జోన్లతో ప్రారంభం అయిన భారతీయ రైల్వే ప్రస్థానం 16కి పెరిగినప్పుడు ఏ రాష్ట్ర౦ కూడా అభ్యంతరం చెయ్యలేదు కానీ మన విశాఖ రైల్వే జోన్ దగ్గరకి వచ్చేసరికి పక్క రాష్ట్రాలు అభ్యంతరం చేస్తున్నాయని, దానిని ప్రధాన కారణంగా కేంద్రం చూపిస్తుంది


వాల్తేరు డివిజన్ లో సుమారు 80 శాతాన్ని  ఒడిశాలోనే కొనసాగించి ఇతర ప్రాంతాలను కలుపుకొని విశాఖ కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే అంశం కూడ ప్రతిపాదన వచ్చింది. అయితే త్వరలోనే ఒడిశా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో  వాల్తేరు డివిజన్  విభజన తదితర అంశాలు రాజకీయంగా బిజెపి నేతలకు ఇబ్బందులు కల్గించే అవకాశాలు  లేకపోలేదనే చర్చ కూడ లేకపోలేదు.  ఈ కారణంగానే ఒడిశాకు చెందిన బిజెపి నేతలు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయమై కొంత ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.  


ఈ విషయమై ఏపీకి చెందిన కొందరు బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంధ్రప్రధాన్ తో ఈ విషయమై  చర్చించారని కూడ ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో కూడ లేకపోలేదు.  ఈ సమయంలో రైల్వే డివిజన్ ను  విభజిస్తే రాజకీయంగా నష్టపోయేందుకు ఒడిశా బిజెపి నేతలు సుముఖంగా లేరు. ఇది కూడ విశాఖ రైల్వే జోన్  ఏర్పాటుకు అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు కూడ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు  ఈ జోన్ ఏర్పాటు వల్ల స్వయం చోదక శక్తిగా జోన్ మనజాలదనే అభిప్రాయాలను కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. రాజకీయ పరమైన నిర్ణయాలతో  గతంలో  జోన్లను ఏర్పాటు చేసినందున ఏపీకి జోన్ ఇస్తే తప్పేంటని వాదించేవారు కూడ లేకపోలేదు.

అయితే ఈ విషయమై కేంద్రం ఇచ్చిన హమీలను  అమలు చేస్తామని ఏపీ బిజెపి నేతలు తాజాగా ప్రకటించారు. కానీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనతో విశాక రైల్వేజోన్ ఏర్పాటు విషయం మళ్ళీ మొదటికొచ్చినట్టు కన్పిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 

loader