Asianet News TeluguAsianet News Telugu

నైజాంతో కోస్తాను కలిపిన బంధం .. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు నేటితో 50 ఏళ్లు , ఈ రైలు ఎలా పట్టాలెక్కిందో తెలుసా..?

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌తో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసేందుకు తీసుకొచ్చిన విశాఖపట్నం - హైదరాబాద్ డెక్కన్ గోదావరి ఎక్స్‌ప్రెస్ నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది.

visakhapatnam to hyderabad godavari express 50 years celebrations ksp
Author
First Published Feb 1, 2024, 7:38 PM IST

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌తో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసేందుకు తీసుకొచ్చిన విశాఖపట్నం - హైదరాబాద్ డెక్కన్ గోదావరి ఎక్స్‌ప్రెస్ నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ రైలుతో తెలుగువారికి విడదీయరాని అనుబంధం పెనవేసుకుపోయింది. ఇంతటి విశిష్టత నేపథ్యంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు చేసుకున్న సందర్భాన్ని రైల్వే శాఖ ఘనంగా నిర్వహించింది.

దీనిలో భాగంగా విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్‌ స్టేషన్‌లలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. ప్రయాణీకుల భద్రత, సమయ పాలన, పరిశుభ్రత విషయంలో నేటికీ అదే ప్రమాణాలు పాటించడం ఈ రైలు ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైళ్లు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అదే ఆదరణ దక్కుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ విశాఖ ముద్దుబిడ్డ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1974 ఫిబ్రవరి 1న స్టీమ్ ఇంజిన్‌తో తొలిసారిగా వాల్తేర్ నుంచి హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ప్రస్తుతం గోదావరి ఎక్స్‌ప్రెస్ 12727, 12728 నెంబర్లతో ఈ రైలు నడుస్తోంది. తొలుత దీని నెంబర్ 7007.. విశాఖ నుంచి హైదరాబాద్ మధ్య 18 స్టేషన్‌లలో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది. మొత్తం ప్రయాణ దూరం 710 కిలోమీటర్లు. విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి సగటున 12 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. ప్రతిరోజూ సాయంత్రం విశాఖలో 5.20 గంటలకు బయల్దేరి , మరుసటి రోజు ఉదయం 6.45కి హైదరాబాద్ డెక్కన్‌కు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్‌లో ప్రతి రోజూ సాయంత్రం 5.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో 864 , థర్డ్ ఏసీ 192, సెకండ్ ఏసీ 96, ఫస్ట్ క్లాస్‌లో 18 సీట్లు కలిపి మొత్తం 1170 ప్రయాణీకులు ప్రయాణిస్తూ వుంటారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దీని దృష్టిలో వుంచుకుని గరీబ్ రథ్, దురంతో లాంటి రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ.. ఈ రైలుకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో వుంది. ఈ రైలును భువనేశ్వర్ వరకు పొడిగించాలని గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ .. ప్రజలు , రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు. 

ఈ రైలును తొలుత వాల్తేర్.. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ అని జనం పిలుచుకునేవారు.. అయితే ఈ రైలు ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రధాన భూభాగం గుండా వెళ్తుండటంతో పాటు ఆ ప్రాంతవాసులే పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటూ వుండటంతో గోదావరి ఎక్స్‌ప్రెస్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ బండికి డబ్ల్యూఏపీ 4 లోకోమోటివ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. 2011లో ఈ రైలుకు సూపర్‌ఫాస్ట్ రైలు కేటగిరీ వచ్చింది. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios