ఏప్రిల్ లోపుగానే విశాఖపట్టణం నుండి పాలన: టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
ఈ ఏడాది ఏప్రిల్ లోపుగానే విశాఖపట్టణం నుండి పాలన సాగించేలా కసరత్తు చేస్తున్నామని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
విశాఖపట్టణం: ఈ ఏడాది ఏప్రిల్ లోపుగా విశాఖపట్టణం నుండి పాలన సాగనుందని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.మంగళవారం నాడు విశాఖపట్టణంలో టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మీడిాయాతో మాట్లాడారు. విశాఖ గర్జన రోజునే రాజధానిని విశాఖ పట్టణానికి మారుస్తామని తాము ప్రకటించిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. విశాఖ నుండి పాలన సాగించేందుకు వీలుగా ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సీఎం కార్యాలయం కోసం కూడా గెస్ట్ హౌస్ లు , ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల లోపుగా విశాఖపట్టణం నుండి పాలన సాగించాలనేది తమ అభిమతంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్టణం నుండి పాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. భీమిలీ రోడ్డులో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు.
ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పట్టణం ఏపీకి త్వరలో రాజధానిగా మారనుందన్నారు. ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్ కు హజరు కావాలని సీఎం జగన్ కోరారు. జగన్ వ్యాఖ్యలతో విశాఖపట్టణంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని తేలింది
చంద్రబాబునాయుడు ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హజరయ్యారు. రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడ అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి.
also read:ఉగాది నుండే విశాఖ నుండి పాలన: ఏపీ సీఎం జగన్ కసరత్తు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని పాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వైసీపీ ప్రకటించింది. వైసీపీ సర్కార్ విధానాన్ని వివక్షాలు తప్పుబడుతున్నాయి.