విశాఖపట్టణం పరిపాలన రాజధాని, బుగ్గన వ్యాఖ్యలపై ఇలా...: సజ్జల రామకృష్ణారెడ్డి
వికేంద్రీకరణే తమ విధానమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అమరావతి: విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో బుధవారంనాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అసెంబ్లీ ఉంటుందన్నారు. కర్నూల్ న్యాయ రాజధానిగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు.
ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెడతామని ఆయన చెప్పారు. ఏప్రశ్నకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారో తెలియదన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఓ వర్గం మీడియా గందరగోళపర్చేలా ప్రసారం చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మూడు రాజధానులపై మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే సీఎం వైజాగ్ వెళ్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానంగా ఆయన ప్రకటించారు. ప్రజలను ఓ వర్గం మీడియా గందరగోళపరుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయమై కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరూ అపోహలకు గురికావాల్సిన పనిలేదన్నారు.అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఒక రకంగా ఎన్నికల తర్వాత ఇంకో మాట మాట్లాడే నైజం తమ పార్టీది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమేనని కేంద్రం గతంలో ప్రకటించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఏపీలో విశాఖపట్టణం ఒక్కటే రాజదాని అంటూ ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు రాజధానులు మిస్ కమ్యూనికేషన్ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. విశాఖపట్టణం నుండి పాలన సాగుతుందన్నారు.