విశాఖ రైల్వేజోన్‌కు ఆమోదం: వాల్తేర్ డివిజన్ కేంద్రంగా కొత్త వివాదం.. కేంద్రంపై విపక్షాల ఆగ్రహం

విశాఖ రైల్వేజోన్‌కు కేంద్రం ఆమోదం లభించిందని సంతోషించేలోపు.. మరో కొత్త వివాదం రేగింది. వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేసి దాని స్థానంలో రాయగడ కేంద్రంగా మరో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

visakhapatnam railway zone: New controversy over Waltair Railway Division

విశాఖ రైల్వే జోన్ (visakhapatnam railway zone) విషయంలో మరోసారి కేంద్రం అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది రైల్వేజోన్ పోరాట సాధన సమితి . 150 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ రద్దు చేయడం సరికాదన్నారు. వాల్తేర్ డివిజన్ (waltair division) రద్దు చేసిన  కేంద్రం రాయగడ్ కేంద్రంగా కొత్త డివిజన్ ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అంతకుముందు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి (union railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణా కోస్తా రైల్వేజోన్ (South Coast Railway zone)ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్టుగా వెల్లడించారు. వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. 

రైల్వే జోన్ ఏర్పాటుపై చేపట్టిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) సమర్పించిన అనంతరం దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ రైల్వే డివిజన్ పరిధులు, ఇతర అంశాలపై కొన్ని సలహాలు సూచనలు వచ్చాయని.. వీటిపై మరింత లోతుగా విశ్లేషించేందుకు సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

కొత్త రైల్వేజోన్, రైల్వే డివిజన్ కోసం ఇప్పటికే 2020-21 కేంద్ర బడ్జెట్‌లో రూ.170 కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి చెప్పారు. కొత్త జోన్ ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళికలు చేపట్టాలని విశాఖపట్నంలోని దక్షి కోస్తా రైల్వే ఓస్డీకి నిర్దేశించినట్టుగా చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే భూమిని ఎంపిక చేసినట్లు తెలిపిన మంత్రి.. ఆమేరకు అవసరమైన భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్‌, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ ప్రత్యేకాధికారికి నిర్దేశించినట్లు తెలిపారు. 

‘కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అంటే సౌత్ కోస్ట్ రైల్వే (SCOR) నిర్ణయం తీసుకొబడింది. దాని పరిపాలన, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్చల తర్వాత జోనల్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా కొత్త రైల్వే జోన్ (SCOR)..  ప్రస్తుత వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడలో ప్రధాన కార్యాలయంతో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని కేంద్ర మంత్రి తెలిపారు. 

ఇక, కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ నిధుల కేటాయింపుపై ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బదులిస్తూ..కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కోసం 2013-14 మధ్య కేటాయించిన రూ.110 కోట్ల నిధులను.. ప్రస్తుతం రూ. 560.72 కోట్లకు పెంచినట్టుగా మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టకు ఇప్పటివరకూ రూ. 178.35 కోట్లు కేటాయించి రూ. 171.2 కోట్లు ఖర్చు చేసినట్టుగా వెల్లడించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios