హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చెయ్యడం టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తెలంగాణ వెళ్లి కాంగ్రెస్ తో కూటమి కట్టడం వల్ల టీఆర్ఎస్ కు మరింత ప్రయోజనం కలిగిందన్నారు. 

తెలంగాణాలో కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలే ఆ పార్టీని గెలిపించాయన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు  కాబట్టే విజయం సాధించిందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు బీజేపీకి మంచి పరిణామం కాదన్నారు. ఓటమికి గల కారణాలపై సమీక్షించుకుని మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమీక్షించుకోవలసి ఉందన్నారు. ఏది ఏమైనా బీజేపీకి పరిస్థితి సానుకూలంగా లేదని ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు.