ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తిరుపతి స్మార్ట్ సిటీల ఛైర్మన్‌లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. ఈ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో (ysrcp) కలకలం రేగింది. రాష్ట్రంలోని నాలుగు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లకు (smart city project chairmans) చైర్మన్లుగా వున్న నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఛైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వీరు అసంతృప్తితో వున్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారాణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా సీఎం జగన్‌కు పంపిన లేఖల్లో వీరంతా పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిలో విశాఖపట్నం స్మార్టు సిటీ ఛైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు, తిరుపతి స్మార్టు సిటీ ఛైర్మన్ పద్మజ నారుమళ్లి, ఏలూరు స్మార్టు సిటీ ఛైర్మన్ బొద్దాని అఖిల, కాకినాడ స్మార్టు సిటీ ఛైర్మన్ అల్లి రాజుబాబులు వున్నారు.
ఇటీవల విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా చేసింది జగన్ సర్కార్. ఈ నాలుగు స్మార్టు సిటీలకు కొత్తగా ఛైర్మన్లు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పేరుకి స్మార్టు సిటీలే అయినా నిధులు, ఆఫీసులు, సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. ఇదే సమయంలో సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మన్ల నియామకాలు చెల్లవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే రాజీనామా చేయాలని స్మార్ట్ సిటీ ఛైర్మన్లను సర్కార్ ఆదేశించినట్లుగా సమాచారం. అయితే వీరి రాజీనామాపై అధికార వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
