అమరావతి: విశాఖ దుర్ఘటన నేపథ్యంలో సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లడానికి అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు అనుమతి కోరారు. కేంద్రం నుండి అనుమతి లభిస్తే చంద్రబాబు హైదరాబాద్ నుండి నేరుగా విశాఖకు వెళ్లనున్నారు. 

ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు విశాఖ జిల్లా నేతలతో మాట్లాడారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ ప్రాంతంలోని పరిస్థితిని వారు చంద్రబాబుకి వివరించారు. విశాఖ టిడిపి నేతలు,  కార్యకర్తలు తక్షణమే బాధిత ప్రజలకు అండగా నిలవాలని, సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు.  

లాక్ డౌన్ కారణంగా చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో వున్నారు. ఏపిలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన పలుమార్లు ఏపికి రావాలనుకున్నా ఆంక్షల కారణంగా వెళ్లలేకపోయారు. తాజాగా గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటుచేపుకోవడంతో ఎట్టిపరిస్థితుల్లో విశాఖకు వెళ్లాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. 

విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసింది. ఈ దుర్ఘటలనలో ఇప్పటికే 8 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యీరు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొందరి  పరిస్థతి విషమంగా వున్నట్లు సమాచారం.