విశాఖకు పరిపాలన రాజధాని ఖాయమని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కుల తర్వాత విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలివస్తుందని చెప్పారు.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఖాయమని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆదివారం.. జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. వార్డుల వారీగా అభివృద్ది ప్రణాళికలను అమలు చేస్తామని తెలిపారు. విశాఖకు పరిపాలన రాజధాని ఖాయమని చెప్పారు.
న్యాయపరమైన చిక్కుల తర్వాత విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలివస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఉనికి కోసమే ప్రతిపక్షాలు గోదావరి వరదలపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. సీఆర్‌డీఏ చట్టం రద్దుతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మూడు రాజధానులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతి రైతులు నిరసన దీక్షకు దిగారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే గతేడాది నవంబర్‌లో వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. అయితే ప్రజల సంక్షేమం కోసం మరింత సమగ్రమైన, సంపూర్ణమైన, మెరుగైన వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తామని.. తద్వారా రాష్ట్ర పౌరుల విశాల ప్రయోజనాలను పరిరక్షిస్తామని సీఎం జగన్ అసంబ్లీలో చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చి 3న ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్లాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారంలో అసెంబ్లీకి లేదని పేర్కొంది. అయితే వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సీఎం జగన్ చెప్పినట్టుగానే త్వరలోనే సమగ్ర బిల్లు వస్తుందని చెబుతున్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలిస్తామని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
