విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గంలో 17 వార్డులు ఉన్నాయి. వాటిలో వైసీపీకి 15 డివిజన్లు దక్కగా టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిజెపికి ఒక్క డివిజన్ దక్కింది. గంటా శ్రీనివాస రావు 18 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ చెల్లాచెదురేైందని భావిస్తున్నారు. వైసీపీకి ఈ నియోజకవర్గంలో కేకే రాజు ఇంచార్జీగా వ్యవహరించారు. 

విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలు, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా ఉన్నాయి. భిమిలీ, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాజువాక, భిమిలీ, పెందుర్తి నియోజకవర్గాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకోవడంలో విజయం సాధించారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బ తిని వైసీపీ పుంజుకుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 12 నెలలుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తు్నారు. 

విశాఖ తూర్పు నియోజకవర్గంలో 15 డివిజన్లు ఉండగా, వైసీపీ 9 స్థానాలు రాగా, టీడీపీకి 3 మాత్రమే వచ్చాయి. జనసేనకు ఒక్క స్థానం లభించింది. ఒక్క చోటు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జీగా అక్కరమాని విజయనిర్మల వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి పీతల మూర్తియాదవ్ జనసేనలో చేరి 22వ డివిజన్ నుంచి విజయం సాధించారు. 

విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి శానససభకు టీడీపీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో 14 స్థానాలు ఉండగా, వైసీపీకి 9 లభించాయి. టీజీపీకి 5 దక్కాయి. ఈ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వ్యవహరిస్తున్నారు. 

విశాఖ దక్షిణ శాసనసభ నియోజకవర్గంలో కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతను టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 13 స్థానాలున్నాయి. వాటిలో వైసీపీకి 5 దక్కగా, టీడీపీకి 4 దక్కాయి. జనసేన నుంచి ఒక్కరు విజయం సాధించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వీరంతా వైసీపీ తిరుగుబాటు అభ్యర్థులు కావడం విశేషం. వైసీపీ తరఫున బాధ్యతలు నిర్వహించిన వాసుపల్లి గణేష్ కారణంగా ఇది జరిగినట్లు భావిస్తున్నారు 

భిమిలీ నియోజకవర్గానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి సబ్బం హరి ఇంచార్జీగా వ్యవహరించారు. నియోజకవర్గంలోని 9 స్థానాల్లో టీడీపీ 5, వైసీపీ 4 స్థానాలు దక్కించుకున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస రావుకు ఎదురు దెబ్బ తగిలింది.

గాజువాక శాసనసభ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి వీచింది. ఈ నియోజకవర్గంలోని 17 స్థానాల్లో టీడీపీ, వైసీపీ ఏడేసి స్థానాలను దక్కించుకున్నాయి. టీడీపీ బలపరిచిన వైసీపీ, సీపీఎం, జనసేన ఒక్కటేసి స్థానాలను గెలుచుకున్నాయి. 

పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్ెమల్యే అదీప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంచార్జీగా వ్యవహరించారు ఇక్కడ ఆరు డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి ఒకే ఒక్క స్థానం దక్కగా, టీడీపీకి 5 స్థానాలు లభించాయి. 

అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఐదు డివిజన్లలో నాలుగు వైసీపీకి దక్కించుకోగా, ఒక్స స్థానాన్ని మాత్రమే టీడీపీ దక్కించుకుంది.మొత్తం మీద, వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత మందికి కూడా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది.