విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు బుధవారం నాడు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ ను కలిశారు.

శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి నుండి జగన్ బుధవారం నాడు విమానంలో విశాఖపట్టణానికి చేరుకొన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే జగన్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు భేటీ అయ్యారు.

 

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు జగన్ తో పలు అంశాలపై చర్చించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందించారు నేతలు.నాలుగు డిమాండ్లతో కూడిన మూడు పేజీల లేఖను సీఎం జగన్ కు నేతలు అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయాలని తొలి డిమాండ్ గా ఉంది.

స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని నేతలు కోరారు.  అంతేకాదు దేశంలోని ఏ గనైనా కనీసం 2 వేల ఏళ్లపాటు లీజుకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలు ఆ లేఖలో కోరారు.