ఎవరు అడ్డొచ్చినా విజయవాడ వెస్ట్ నుండి బేగ్‌ను గెలిపిస్తా: విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యల దుమారం
మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ నుండి బేగ్ ను గెలిపించుకుంటానని నాని ప్రకటించారు.
విజయవాడ: ఎవరు అడ్డొచ్చిన్నా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బేగ్ ను ఎమ్మెల్యేగా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా కేశినేని నాని ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలోని తన వైరి వర్గీయులను ఉద్దేశించి చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. మూడోసారి పోటీ చేసి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెడతానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బుద్దా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.ఈ ఏడాది జనవరి మాసంలో ఈ విషయాన్ని బుద్దా వెంకన్న ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాగులు మీరా కూడ టీడీపీ టిక్కెట్టును ఆశించారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు తామిద్దరం పనిచేసినట్టుగా నాగులు మీరా అప్పట్లోనే ప్రకటించారు.
అయితే ఇవాళ విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బేగ్ ను బరిలోకి దింపి గెలిపించుకుంటామని కేశినేని నాని చేసిన వ్యాఖ్యాలు ప్రస్తుతం ఆ పార్టీలో చర్చకు దారి తీశాయి. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన జలీల్ ఖాన్ ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి జలీల్ ఖాన్ కూతురు షబానా ముసరఫ్ ఖతూన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి బేగ్ ను బరిలోకి దింపి గెలిపిస్తానని కేశినేని నాని ప్రకటించడం ప్రస్తుతం టీడీపీలో కలకలం రేపుతుంది.
also read:ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థనైనా స్వాగతిస్తాం: వాలంటీర్లపై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
గతంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సమయంలో పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు చేశారు.కేశినేని నాని తీరుపై టీడీపీ నేతలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేశినేని నాని సోదరుడు చిన్ని విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పరిణామం కేశినేని నానిని అసంతృప్తికి గురి చేసింది.
దీంతో పార్టీలో తన వైరి వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బుద్దా వెంకన్నకు చెక్ పెట్టేందుకు గాను విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బేగ్ ను తెరమీదికి తీసుకు వచ్చారు కేశినేని నాని.ఈ పరిణామాలపై టీడీపీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందోననే చర్చ సాగుతుంది.