కార్పోరేషన్ ఎన్నికలకు ముందే వైసిపి షాక్... బీసీ సెల్ అధ్యక్షుడి రాజీనామా
విజయవాడ నగర బీసీ సెల్ అధ్యక్షులు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసిపిని కూడా వీడటానికి సిద్దపడ్డ అతడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
విజయవాడ: పంచాయితీ ఎన్నికలను ముగించుకుని మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల కోసం సిద్దమవుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. విజయవాడ నగర బీసీ సెల్ అధ్యక్షులు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసిపిని కూడా వీడటానికి సిద్దపడ్డ అతడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ... ప్రస్తుత సీఎం జగన్ గతంలో ఓదార్పుయాత్ర చేసే సమయంలో విజయవాడకు రాగా స్వయంగా ఆయన చేతులమీదుగా వైసిపి కండువా కప్పుకుని పార్టీ చేరానని గుర్తుచేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసానన్నారు.
''2014 లో తెదేపా అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయా. సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధ వెళ్ళిపోయాక ఇంచార్జిగా మల్లాది విష్ణు వచ్చారు.ఆయన వద్ద కూడా పని చేశా. నేను ఇదివరకు పోటీ చేసిన వార్డు ఇప్పుడు బీసీ అయింది, సీట్ ఇస్తారునుకున్నా. ఒక బీసీ అభ్యర్థిగా పోటీలో నిలబడదామనుకున్న కానీ నన్ను పక్కన పెట్టి వేరే వారికి ఇచ్చారు. కనీసం ఈ వార్డు కాకపోయినా నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇస్తారునుకున్నా. కానీ ఇవ్వలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
read more పిరికివాడా... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ..: జగన్ పై లోకేష్ ఫైర్
''పార్టీ పెట్టినదగ్గర నుంచి ఇప్పటివరకు నేను చేసిన పనిని గుర్తించలేదు. 30వ వార్డులో అభ్యర్థి చనిపోతే అక్కడైనా అవకాశం ఇవ్వమని అడిగా. అదీ ఇవ్వలేదు. ఇలా నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా పార్టీలోనే ఉంటే ఎదుగుదల ఉండదని భావిస్తున్నా. పార్టీకి పని చేసిన వ్యక్తిని కాదని కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. కనీసం పార్టీకోసం పని చేసిన వ్యక్తి టికెట్ ఇచ్చి పని చేయమంటే చేసేవాడిని ,ఎవరో కొత్త వ్యక్తికి ఇచ్చారు'' అని ఆరోపించారు.
''వైసిపి సీనియర్ సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే సమాధానం వచ్చింది. రాజధాని నగరమైన విజయవాడలో ఒక బీసీకి టికెట్ ఇవ్వని పరిస్థితి. బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జగన్ దాకా ఈ అంశాలను తీసుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వరు. పార్టీ నన్ను గుర్తించడం లేదు కాబట్టి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా. అవకాశం ఉన్న చోట కూడా ఇవ్వకుండా ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అనే పరిస్థితి వచ్చింది. సస్పెండ్ చేయకముందే నేనే పార్టీని వీడుతున్నా.దాదాపు 10 సంవత్సరాలు పార్టీ కోసం పని చేసా ,కన్నతల్లిలాంటి పార్టీని వీడడం కష్టంగా ఉంది'' అంటూ రాజేష్ కన్నీటి పర్యంతమయ్యాడు.