విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ దిగువన వున్న కృష్ణ లంకలో భారీగా వరద చేరుతోంది. నదీ పరివాహాక ప్రాంతాల్లో ఇళ్లు జలమయమయ్యాయి.

కృష్ణలంకతో పాటు పటమట లంక, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 

శ్రీశైలం నుంచి వరద నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. జలాశయం నిండినందున 14 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 2,49,055 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 2,49,055 క్యూసెక్కుల నీటిని పులి చింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది.

అటు జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.