ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసిపిలో చేరేందుకు సిద్దమైనట్లు తెెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగినే ఆయన రేపు వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

విజయవాడ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధానపార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించడంతో జంపింగ్ లకు తెరలేచింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లు, టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు వైసిపికి రాజీనామా చేసారు. ఇక ప్రతిపక్ష టిడిపిలో అభ్యర్థుల ప్రకటన కంటే ముందే రాజీనామాలు ప్రారంభమయ్యాయి. ఇలా విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామాకు సిద్దమయ్యాడు. ఎంపీ పదవితో పాటు టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన నాని అతి త్వరలోనే వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ(బుధవారం) కేశినేని నాని ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. కేవలం తానుమాత్రమే కాదు మరికొందరు కీలక టిడిపి నాయకులను వైసిపిలోకి తీసుకువస్తానని ... అయితే వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వైసిపి అధినేత జగన్ ను నాని కోరనున్నట్లు సమాచారం. టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చాకే నాని వైసిపి కండువా కప్పుకోనున్నారట. అన్నీ అనుకున్నట్లే జరిగితే రేపు(గురువారం) నానితో పాటు మరికొందరు టిడిపి నేతలు వైసిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇంతకాలం తనతో కలిసి పనిచేసిన ఐదుగురికి ఎమ్మెల్య టికెట్లు ఇప్పించుకునేందుకు నాని ప్రయత్నిస్తున్నారు. ఇక ఎలాగూ తన ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయితేనే ఆయన వైసిపిలో చేరడం ఖాయం కానుంది. ఇలా తనను నమ్ముకున్న నేతల కోసం వైసిపి అధినేత జగన్ తో నాని చర్చించనున్నారు. అయితే ఆయన కోరినట్లు ఓ ఎంపీ, ఐదు ఎమ్మెల్యే టికెట్లు కాకుండా ఓ ఎంపీ, రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు వైసిపి సుముఖంగా వున్నట్లు సమాచారం. 

Also Read మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?

వైసిపిలో చేరినా తిరిగి విజయవాడ లోక్ సభ నుండే నాని పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పటికే కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత తండ్రితో పాటే వైసిపిలో చేరే అవకాశాలున్నాయి... ఆమెకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది. అలాగే తనవెంట నడిచేందుకు సిద్దమై ఎమ్మెస్ బేగ్ కు విజయవాడ పశ్ఛిమ, కన్నెగంటి జీవరత్నంకు నందిగామ, నల్లగట్ల స్వామికి తిరువూరు, బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం అసెంబ్లీ టికెట్లు ఇప్పించుకునేందుకు కేశినేని నాని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వైసిపి పెద్దలతో చర్చించిన నాని ఇవాళ వైఎస్ జగన్ తో కూడా చర్చించనున్నారు.