మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?
మాజీ మంత్రి పార్థసారథి తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు చర్చలు జరిపినా కూడ పార్థసారథి మెత్తబడలేదు.
విజయవాడ: మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతుంది. రెండు రోజులుగా పార్ధసారథితో వైఎస్ఆర్‌సీపీ నేతలు చర్చించారు. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతల చర్చలతో పార్థసారథి సంతృప్తి చెందలేదని ఆయన వర్గీయుల్లో ప్రచారంలో ఉంది.
బుధవారం నాడు ఉదయం కొందరు తెలుగు దేశం పార్టీ నేతలు పార్థసారథితో చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయమై పార్థసారథి కానీ, తెలుగు దేశం పార్టీ నుండి కూడ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాజీ మంత్రి పార్థసారథితో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత కూడ పార్థసారథి మెత్తబడలేదని ప్రచారం సాగుతుంది.
వైఎస్ఆర్‌సీపీ బస్సు యాత్ర పెనమలూరు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో పార్థసారథి చేసిన వ్యాఖ్యలు కూడ కలకలం రేపాయి. తనను పెనమలూరు ప్రజలు నమ్మారన్నారు. కానీ, దురదృష్టవశాత్తు సీఎం జగన్ తనను నమ్మలేదని పార్థసారథి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పార్థసారథి వివరణ ఇచ్చారు.
పార్థసారథితో తెలుగు దేశం పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతుంది. విశాఖపట్టణం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్థసారథితో చర్చిస్తున్నట్టుగా సమాచారం. విజయవాడకు చెందిన తెలుగు దేశం పార్టీ నేత సుబ్బారావుతో కూడ పార్థసారథి చర్చించారని ప్రచారం సాగుతుంది. పెనమలూరు, లేదా నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పార్థసారథి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలుగు దేశం పార్టీలో చేరితే నూజివీడు నుండి పార్థసారథి బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలాఖరులో పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై పార్థసారథి మాత్రం ప్రకటన చేయలేదు. పార్టీ మార్పు విషయమై పార్థసారథి తన వర్గీయులకు సంకేతాలు ఇచ్చారనే చెబుతున్నారు. పార్థసారథితో పాటు ఆయన అనుచర వర్గం పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడ నెలకొంది.
ఈ నెల 18వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడలో చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు రా కదలి రా సభలో పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుంది.