మానవత్వం చాటుకున్న దుర్గగుడి ఛైర్మన్, తాళాలు పగులగొట్టి .. వృద్ధురాలికి విడుదల (వీడియో)
అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలి పట్ల దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మానవత్వం చూపించారు. తాళాలు తమ వద్ద లేవని సిబ్బంది చెప్పడంతో ఆయన చేసేదేం లేక తానే స్వయంగా తాళాలు పగులగొట్టి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు రాంబాబు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవుదినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలి పట్ల దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మానవత్వం చూపించారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి దర్శనం కోసం మహామండపం మెట్ల మార్గం వైపు ఓ వృద్ధురాలు వచ్చింది.
అయితే ఆదివారం ఉదయం నుంచే మహామండపం మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి గేట్లకు తాళాలు వేశారు జిల్లా కలెక్టర్. దారిలేదనే సమాచారం లేక మెట్లమార్గంలో వున్న ఏడు అంతస్తులు ఎక్కింది సదరు వృద్దురాలు. అయితే తిరిగి ఏడు అంతస్తులు దిగలేక , అరగంటకు పైగా మహామండపం ఏడవ అంతస్తు వద్ద గేట్లను పట్టుకొని నిలబడే వుంది. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో గేటు వద్దే కూలబడిపోయింది. అదే సమయంలో చైర్మన్ కర్నాటి రాంబాబు , ఇతర పాలకమండలి సభ్యులు అటుగా వెళ్తున్నారు.
వృద్దురాలు బాధను చూసి తాళాలు తీయించడానికి ఛైర్మన్ రాంబాబు ప్రయత్నించారు. అయితే తాళాలు తమ వద్ద లేవని సిబ్బంది చెప్పడంతో ఆయన చేసేదేం లేక తానే స్వయంగా తాళాలు పగులగొట్టి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు రాంబాబు. అనంతరం వృద్ధురాలికి సపర్యలు చేసి దగ్గరుండి దర్శనానికి పంపారు. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ.. తమ వాళ్లు కనిపించకపోవడంతో దారి తప్పి మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చానని చెప్పింది. తన బాధను అర్ధం చేసుకుని బయటకు తీసుకొచ్చిన ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర పాలక మండలి సభ్యులకు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలియజేసింది.