ఏదో ఒక విషయంలో విజయవాడ కనకదుర్గమ్మవారి గుడి వివాదాల్లోకి ఎక్కుతోంది. మొన్నామధ్య ఆలయంలో క్షుద్రపూజలు చేశారంటూ ఆరోపణలు రాగా.. తాజాగా అమ్మవారి పట్టుచీర మాయమైంది. ఇది కూడా పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో.. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలకు శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా దుర్గగుడి ఈవో పద్మకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. బ్రాహ్మణకార్పొరేషన్ ఎండీగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. అలాగే దేవాదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పద్మస్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు. ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చారు.
  
మరోవైపు ఆషాడ మాసం సారె ఇచ్చే సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడంపై ఏబీఎన్‌లో వచ్చిన వరుస కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దేవాదాయశాఖ అంతర్గత విచారణతో పాటు, ప్రధమిక దర్యాప్తులో చీరను పాలకమండలి సభ్యురాలు సూర్యలతకుమారి తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో గత రాత్రి దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా సూర్యలతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.