తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్రను గుంటూరు జీజీహెచ్‌ నుంచి విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడానికి 24 గంటల సమయం ఉండటంతో పోలీసులు నిందితుడిని దిశ పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చారు.

దీంతో దిశా టీమ్‌ నాగేంద్ర నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డారు. గత రెండు గంటల నుంచి హత్యకు గల కారణాలపై పోలీసులు నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు.

కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం ఉంది. అనంతరం చార్జ్‌షీట్‌ దాఖలు చేసి నాగేంద్రను పోలీసులు కస్టడీకి కోరనున్నారు.

కాగా పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా దివ్యది హత్యగా తేల్చిన సంగతి తెలిసిందే. ఆమె ఒంటిపై గుర్తించిన కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని, నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లు నిర్ధారించారు.

Also Read:దివ్యతేజ హత్య కేసు: ఆసుపత్రి నుండి నాగేంద్రబాబు డిశ్చార్జ్

దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు.

విజయవాడ క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.