విదేశాల నుండి ఇండియాకు తీసువచ్చిన 11కిిలోల బంగారం, లక్షన్నర విలువైన విదేశీ కరెన్సీని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ : విదేశాల నుండి ఇండియాకు తీసుకువచ్చిన భారీ బంగారం ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుబడింది. తమిళనాడు రాజధాని చెన్నై నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు నిందితులను పట్టుకున్నారు.
విజయవాడ కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల శ్రీలంక, దుబాయ్ నుండి అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చిన బంగారాన్ని విజయవాడకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేపడుతున్న కస్టమ్స్ అధికారులు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేపట్టిన అధికారులు 11 కిలోల బంగారం గుర్తించారు. అలాగే కువైట్, ఖతార్, ఒమన్ దేశాలకు చెందిన రూ.1.5 లక్షల విలువచేసే కరెన్సీ లభించింది.

ఆగస్ట్ 25 తెల్లవారుజామున చేపట్టిన తనిఖీల్లో బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం 4.3 కిలోల ముడి బంగారం, 6.8 కిలోల ఆభరణాలు వున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ బంగారాన్ని గుర్తించకుండా ఆయా దేశాలకు చెందిన గుర్తులను చెరిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Read More మంత్రి చెల్లుబోయిన తమ్ముడిని అంటూ డబ్బులు డిమాండ్.. పోలీసులు రంగంలోకి దిగడంతో..
బంగారంతో పట్టుబడిన నిందితున్ని కస్టమ్స్ యాక్ట్ 1962 కింద అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని కోర్టు ముందు హాజరుపర్చగా 13 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. గత రెండేళ్లతో విజయవాడ కస్టమ్స్ కమీషనరేట్ పరిధిలో రూ.40 కోట్ల విలువచేసే 70 కిలోల అక్రమ బంగారం పట్టుబడటం కలకలం రేపుతోంది. పట్టుబడిన బంగారమే ఈ స్థాయిలో వుంటే అధికారులు చిక్కకుండా మరెంత బంగాారం ఏపీకి చేరివుంటుందో ఊహించవచ్చు.
