గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ...
గత ఎన్నికల సమయంలో నమోదయిన కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో గన్నవరం ఎమ్మెల్యే అరెస్ట్ కు వారెంట్ జారీ చేసింది విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు.

విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ వారెంట్ ను జారీచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ వివాదంలో వంశీపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేసారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుండి టిడిపి అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీచేసారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన వివాదంలో వంశీతో పాటు 38 మందిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు హాజరుకాకపోవడంతో ఇప్పటికే వంశీకి బెయిలబుల్ వారెంట్ జారీచేసింది న్యాయస్థానం. అయినా కూడా ఆయన ఇవాళ జరిపిన విచారణకు గైర్హాజరు కావడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ వ్యవహారంపై ఇటు పోలీసులు, అటు వంశీ ఎలా స్పందిస్తారు... ఏం చేస్తారో చూడాలి.
Also Read గంజాయి స్మగ్లింగ్ కోసం సిక్ లీవ్... తెలంగాణలో ఏపీ పోలీసుల పరువు తీసారుగా...
ఇదిలావుంటే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుండే పోటీచేసి విజయం సాధించారు వల్లభనేని వంశీ. ఈ ఎన్నికల్లో వైసిపి హవా వీచినా టిడిపి కీలక నాయకులు ఓటమిపాలైనా వంశీ మాత్రం గెలుపొందాడు. కానీ అధికారాన్ని కోల్పోయిన టిడిపిలో ఎక్కువకాలం వుండలేకపోయిన ఆయన అధికార వైసిపి దగ్గరయ్యారు. ఇప్పటివరకు అధికారికంగా వైసిపిలో చేరకున్నా అధికారపార్టీ సభ్యుడిగానే వ్యవహరిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ లతో పాటు టిడిపి నాయకులకు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ... సీఎం వైఎస్ జగన్, వైసిపి నాయకులపై ప్రశంసలు కురిస్తున్నారు.