Asianet News TeluguAsianet News Telugu

గంజాయి స్మగ్లింగ్ కోసం సిక్ లీవ్... తెలంగాణలో ఏపీ పోలీసుల పరువు తీసారుగా...

తెలంగాణ ముందు ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల పరువు తీసారు ఇద్దరు ఖాకీలు. బాధ్యతాయుతమైన పోలీస్ జాబ్ చేస్తూనే గంజాయి దందా చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. 

Andhra Pradesh Police Arrested in Telangana to supply Ganja AKP
Author
First Published Feb 2, 2024, 1:09 PM IST | Last Updated Feb 2, 2024, 1:16 PM IST

హైదరాబాద్ : నేరాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరగాళ్లుగా మారారు. ఉద్యోగానికి సెలవు పెట్టిమరీ గంజాయి స్మగ్లింగ్ కు ప్రయత్నించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల వ్యవహారం తెలంగాణలో బయటపడింది. ఇద్దరు ఏపీ పోలీసులు    గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్ గా హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. 

పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తానికి మచ్చతెచ్చే సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడలోని థర్డ్ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్(35), కానిస్టేబుల్ శ్రీనివాస్(32) పనిచేస్తున్నారు. నెలా నెలా వచ్చే జీతంతో జీవితం హాయిగా సాగుతున్నా వారికది సంతృప్తి ఇచ్చినట్లుగా లేదు.. ఒకేసారి భారీగా డబ్బులు సంపాదించడానికి నేరాల బాట పట్టారు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఈ ఇద్దరు పోలీసుల కాస్త స్మగ్లర్లుగా మారారు. 

అనారోగ్య కారణాలు చెప్పి పోలీస్ జాబ్ కు సెలవుపెట్టిన సాగర్, శ్రీనివాస్ లు నర్సీపట్నంలో గంజాయిని సేకరించారు. ఈ గంజాయిని స్వయంగా ఈ ఇద్దరే కారులో హైదరాబాద్ కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్ పై పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటి పోలీసులు కాపుకాసారు. అర్ధరాత్రి వీరిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే ఒక్కసారిగా దాడిచేసి వాహనంలోని 22 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read  TSRTC : బస్సులో తాగుబోతు మహిళ వీరంగం ... కండక్టర్ ను బూతులు తిడుతూ, కాలితో తంతూ....

గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సాగర్, శ్రీనివాన్ లను అదుపులోకి తీసుకున్న ఎస్వోటి పోలీసులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో వారు చెప్పిన వివరాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. వారిద్దరూ ఏపీ పోలీసులని... సిక్ లీవ్ పెట్టి మొదటిసారి గంజాయి స్మగ్లింగ్ కు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. వారివద్ద పట్టుబడిన గంజాయి విలువ రూ.8 లక్షల వరకు వుంటుందని పోలీసులు చెబుతున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios