మాకే ఈ దుస్థితి వుంటే... సామాన్య భక్తుల పరిస్థితేంటో..!: విజయవాడ ఆలయ బోర్డ్ మెంబర్ సీరియస్ (వీడియో)
శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణల్లో దర్శనమిచ్చే విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందు వచ్చే భక్తులు అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడని ఆలయ పాాలకమండలి సభ్యులు సత్తయ్య ఆరోపించారు.

విజయవాడ : దసరా నవరాత్రుల వేళ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని చెబుతున్నారు. రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని కనులారా చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారని తెలిసినా అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. చివరకు అధికారులు తీరుపై ఆలయ పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ ఆలయ అధికారులు బోర్డు సభ్యులను చులకనగా చూస్తున్నారని... కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని ఆలయ పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య ఆరోపించారు. అధికారులు తన ఇష్టమున్నవారికే అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకునే అవకాశం ఇస్తున్నారని అన్నారు. చివరకు తమ అనుచరులు, తెలిసినవారు, వైసిపి కార్యకర్తలకు అమ్మవారి దర్శనం చేయించే భాగ్యం కూడా లేకుండా చేస్తున్నారని సత్తయ్య అన్నారు.
చివరకు పాలకమండలి సభ్యులను కూడా ఆలయ అధికారులు అడ్డుకుంటున్నారని సత్తయ్య ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తమకు జరుగుతున్న అవమానాలపై స్పందించాలని... వెంటనే తగిన గౌరవం దక్కేలా చూడాలని కోరారు. బోర్డు సభ్యులతో పాటు అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులు అధికారుల తీరుతో ఇబ్బంది పడుతున్నారని... వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆలయ బోర్డ్ మెంబర్ సత్తయ్య విజ్ఞప్తి చేసారు.
వీడియో
ఇదిలావుంటే దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం చిన్నపిల్లలు, వృద్దులతో కలిసి గంటల తరబడి క్యూలైన్లలలో వేచి ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా విఐపిల సేవలో మునిగితేలుతున్నారని... సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటున్నారు. చివరకు రూ.500 చెల్లించి ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకున్న గంటల సమయం పడుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుదూర ప్రాంతాలనుండి అమ్మవారి దర్శనంకోసం వచ్చిన భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఐపిలకు ఒక రూల్, సామాన్య భక్తులకు మరో రూల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అంతగా విఐపి సేవలో తరించాలనుకుంటే ఈ నవరాత్రులు సామాన్య భక్తులకు ఆలయ ప్రవేశం లేదని ప్రకటిస్తే సరిపోతుంది కదా అని అన్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగడంలేదని... అమ్మవారి ప్రత్యేక పూజలు, నివేదన సమయంలోనే కొద్దిసేపు భక్తులను ఆపుతున్నామని అంటున్నారు.