చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691=23 ... బాబుకు ఇదే చివరి ఏడాది..: విజయసాయి రెడ్డి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు రాాజమండ్రి సెంట్రల్ జైల్లో కేటాయించిన ఖైదీ నెంబర్ పై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. మొన్నంతా చంద్రబాబు అరెస్ట్, విచారణ సాగగా... నిన్నంతా విజయవాడ ఏసిబి కోర్టులో వాదనలు సాగాయి. సుదీర్ఘ విచారణ అనంతరం టిడిపి హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర వుందన్న సిఐడి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పెట్టారు పోలీసులు.
అయితే చంద్రబాబుకు రాజమండ్రి జైలు అధికారులు ఖైధీ నెంబర్ 7691 కేటాయించారు. ఇలా చంద్రబాబు అరెస్ట్, ఖైదీ నెంబర్ కేటాయింపుపై వైసిపి రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఖైదీ నెంబర్ 7691 ను కూడితే 23 వస్తుందని... ఇది 2023 చంద్రబాబుకు చవరి ఏడాది అనేదాన్ని సూచిస్తుందని అన్నారు. అంటే 2024లో చంద్రబాబు రాజకీయాల్లో కనిపించరనే సంకేతం ఈ ఖైదీ నెంబర్ ద్వారా వెలువడిందని విజయసాయి అన్నారు.
గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపొడిచి అధికారాన్ని లాక్కోడమే కాదు కొడుకులు, కూతుళ్లను కూడా చంద్రబాబు దూరం చేసారని విజయసాయి అన్నారు. ఇలా అన్నీ దూరమై ఎన్టీఆర్ ఎంతటి మనోవేదనను అనుభవించారో ఇప్పుడు చంద్రబాబుకు అర్థమై వుంటుందన్నారు. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితమే వస్తుందంటూ చంద్రబాబుకు జైలు శిక్షపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేసారు.
ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడ ఏసిబి కోర్టు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో పలు నాటకీయ పరిణామాల నడుమ ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గంలో తరలించారు. చంద్రబాబును తరలించేందుకు దాదాపు ఐదు గంటలు పట్టింది. మార్గమధ్యలో ఎలాంటి ఉద్రిక్తతలు తల్లెత్తడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు చంద్రబాబు కోసం స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు. అలాగే ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా భారీగా మొత్తంలో పోలీసులు మోహరించారు. చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా రాజమండ్రికి వెళ్లారు.