ఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించి ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాసరావును తీహార్ జైలుకు తరలించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. 

శ్రీనివాస్ ను హతమార్చి తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి కేసును హైకోర్టు ఎన్ఐఏకు బదిలీ చేసినప్పటి నుంచి తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని చంద్రబాబు భయంతో వణికి పోతున్నారని విమర్శించారు. 

నిందితుడి శ్రీనివాస్ దగ్గర దొరికిన లేఖ ముగ్గురితో రాయించాడని పోలీసులు చెప్తున్నారని అయితే నాలుగులైన్లు రాయలేని వ్యక్తి జైలులో పుస్తకం రాస్తున్నాడని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 

ఇదంతా చంద్రబాబు నాయుడు సృష్టేనన్నారు. శ్రీనివాస్ ను అంతమెుందించి ఆయన రాసినట్టు చెబుతున్న పుస్తకాన్నే వాంగ్మూలంగా పరిగణించాలని ఎన్ఐఏ అధికారులను కోరేందుకు ఈ డ్రామా ఆడుతున్నారేమోనన్న సందేహం కలుగుతోందన్నారు విజయసాయిరెడ్డి. 

ఎన్ఐఏ దర్యాప్తుకు సహకరిస్తే చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే వైజాగ్ పోలీసులు అంటీముంటనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దర్యాప్తు కొనసాగుతుందని నిందితులను పట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. 

అయితే దర్యాప్తు పూర్తయ్యేలోపు నిందితుడికి ప్రాణహాని జరిగితే చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసులో ఆపరేషన్ గరుడ సృష్టికర్త నటుడు శివాజిని కూడా విచారించాలని డిమాండ్ చేశారు. 

దాడి సమాచారం ముందుగా ఎక్కడ నుంచి వచ్చిందో అతడిని ఇన్వెస్టిగేట్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. శివాజీ ఆర్థిక వనరుల పైనా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ లిస్టును బయటకు తీస్తే డొంక కదులుతుందని స్పష్టం చేశారు.