బాబు విదేశాల్లో దాచుకున్న డబ్బుతో అద్భుతమైన రాజధాని

బాబు విదేశాల్లో దాచుకున్న డబ్బుతో అద్భుతమైన రాజధాని

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని విదేశాల్లో దాచుకున్న మూడు లక్షల కోట్ల రూపాయలను తిరిగి రాష్ట్ర ఖజానాలతో జమ చేస్తే అద్బుతమైన రాజధాని నిర్మించుకోవచ్చునని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు విదేశాల్లో దాచుకున్న డబ్బును వెనక్కి తేవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆయన బుధవారంనాడు తన పాదయాత్రను కొనసాగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. మంత్రులు, టీడిపి ఎమ్మెల్యేలు ఈ లైంగి దాడుల్లో భాగస్వాములు కావడం దారుణమని అన్నారు. 

ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లు బిజెపితో జత కట్టి ధనార్దనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగించారని, బిజెపి పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి ఎన్డీఎ కూటమి నుంచి బయటకు వచ్చి బిజెపితో తమ పార్టీ జతకట్టినట్లు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.

మూడు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న చంద్రబాబు ఒక దొంగ అని, ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి దొంగ కాకుండా ఏమవుతారని అన్నారు. అవినీతికి పాల్పడి, బిజెపికి భయపడి, ప్రజల వద్ద సాగిలబడి వేడుకునే పరిస్థితి చంద్రబాబుదని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ నెల 16వ తేదీన విశాఖలో ధర్మ పోరాటం పేరిట చేయబోతున్న దీక్ష ఎవరి మీద పోరాటమో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos