ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇంతకాలం కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ వైరస్ గ్రామాలకు కూడా పాకుతోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పాకిన ఈ మహమ్మారి ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలా తాజాగా విజయనగరం జిల్లాలో ఏకంగా కలెక్టరేట్ ఉద్యోగికి కరోనా సోకడం జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.  

విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మహిళ ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యింది. ఈ క్రమంలో ఆమె కార్యాలయంలోని వివిధ సెక్షన్లకు వెళ్లి ఇతర ఉద్యోగులను కలిశారు. అంతేకాకుండా జేసి నిర్వహించిన సమావేశంలో  పాల్గొన్నారు. 

అయితే ఇటీవల ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె తోటి ఉద్యోగులతో పాటు కలెక్టర్ ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారుల్లో కలవరం మొదలయ్యింది. 

ఈ పరిస్ధితిలో కలెక్టరేట్‌ లో కార్యకలాపాలన్ని నిలిచిపోయాయి. సుమారు 100 మంది కలెక్టరేట్ ఉద్యోగులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా పరీక్షలు చేయించుకున్నారు.

read more  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేకి సోకినా కరోనా వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం మొత్తం  443  కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 16704 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 392 మందికి కరోనా సోకింది. 83 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఒక్కరోజులో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ వైరస్ మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 111కి చేరుకొంది.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7451 పాజిటివ్ కేసులకు గాను 3437 మంది డిశ్చార్జ్ కాగా 111 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3903గా వుంది. రాష్ట్రంలో అత్యధిక కేసుల్లో కర్నూల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1354 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణాలో 1063 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 1584 మందికి కరోనా సోకింది. ఇందులో 638 యాక్టివ్ కేసులు. కరోనా నుండి కోలుకొని 946 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. విదేశాల నుండి  రాష్ట్రానికి వచ్చిన వారిలో 337 కేసులు నమోదయ్యాయి. ఇందులో 285 యాక్టివ్ గా ఉన్నాయి. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.