హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోడెల శివప్రసాదరావు ఇంటి అద్దెపేరుతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

కోడెల శివప్రసాద్ రావు అధికారిక నివాసం, కమ్ క్యాంప్ ఆఫీసు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని ఇరాన్ కాన్సులేట్ సమీపంలోని ఓ ఇంటిని చూపిస్తోంది. 8-2-503 నెంబరుగల ఇంటిలో స్పీకర్ కోడెల నివాసం ఉంటున్నట్లు చూపిన ఆధారాలను వైసీపీ బయటపెట్టింది. 

8-2-503 నంబర్ గల ఇంటిని తన నివాసం, క్యాంపు కార్యాయలంగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ 2017 మే 4న 994 జీవోను జారీ చేసింది. ఆయన అద్దెకు ఉంటున్నట్లు చూపి ప్రైవేట్ భవనానికి ప్రతీ నెల చెల్లిస్తున్న అద్దె అక్షరాలా లక్ష రూపాయలని ఉత్తర్వులో ఉంది. 

అసలు మ్యాటర్ ఏంటంటే స్పీకర్ కోడెల అధికార నివాసం పేరిట ఉన్న నంబర్ గల ఇంటిలోనే శ్రీవెంకటేశ్వర మల్టీఫ్లెక్సెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ కార్యాలయం ఉన్నట్లు రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. 

అంతేకాదు శ్రీ వెంకటేశ్వర మల్టీఫ్లెక్సస్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్ సైట్ లో కార్యాలయం అడ్రస్ కూడా కోడెల చూపించిన ఇంటి నంబరుతోనే ఉంది. 2007 సెప్టంబర్ 21న అన్ లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీగా నమోదైంది. 2018 సెప్టంబర్ 29న వార్షిక సర్వసభ్య సమావేశం కూడా అదే నివాసంలో జరిగినట్లు సంస్థ వెబ్ సైట్లో పొందుపరచింది. 

ఒక స్పీకర్ అధికారిక నివాసంలో ఇలాంటి వార్షిక సర్వసభ్య సమావేశాలు జరగడం సాధ్యమా అన్న సందేహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి ఆరా తీస్తే అది మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడదని తేలింది. 

అయితే దేవేందర్ గౌడ్ తనయుడు కార్యాలయంలో అద్దెకు ఉంటూ స్పీకర్ కోడెల లక్షలాది రూపాయలు బొక్కేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో నివసించకుండానే అద్దె కింద నెలకు రూ.లక్ష ప్రజాధనాన్ని బొక్కిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. 

గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని తక్షణం విచారణకు ఆదేశించాలని కోరారు. స్పీకర్ పదవిని ఇంతగా దిగజార్చిన వ్యక్తి దేశంలో ఇంకెక్కడా కనిపించరంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.